చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం(Chandragiri mandal) ఐతేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టడంతో కారు నుజ్జు నుజ్జయ్యింది. లారీ కింద కారు ఇరుక్కు పోవడంతో మొత్తం నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకునే లోపే ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతులంతా విశాఖ జిల్లా(Visakhapatnam district ) గాజువాకకు చెందిన వారుగా గుర్తించారు. తిరుపతి నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్‌కు వెళుతూ వారి కారు ప్రమాదానికి గురైంది. లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు అతి వేగంలో ఉన్నప్పుడే అదుపు తప్పి డివైడర్‌ను కొట్టింది. ఆ సమయంలోనే లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది. దాంతో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. గాజువాక చెందిన 23 ఏళ్ళ ప్రేమ్ కుమార్, 25 ఏళ్ల స్వాతి, రెండేళ్ల చాము, 25 ఏళ్ల సునీల్ కుమార్ కారులోనే చనిపోయారు. కారు డ్రైవర్ ఖాదర్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు మృతి
ఇటు తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గరు ప్రాణాలు విడిచారు. కల్వకుర్తి మండలం మార్చాల వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. వెల్దండ మండలం బండోనిపల్లిలో ఓ పెళ్లికి హాజరై తిరిగొస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మృతులను కొండమల్లెపల్లికి చెందిన అరవింద్ (23), మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పీఏ పల్లికి చెందిన శిరీష (20)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రేణుక అనే అమ్మాయిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు