తక్కువ రేటుకు బంగారం వస్తుందంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు.. తీరా చూస్తే షాక్..!

తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామని మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకునే గ్యాంగ్‌ను గుణదల పోలీసులు ఛేదించారు. నకిలీ పోలీసుల వేషధారణలో బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురిని సోమవారం (మార్చి 23) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

తక్కువ రేటుకు బంగారం వస్తుందంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు.. తీరా చూస్తే షాక్..!
Gold

Edited By:

Updated on: Mar 24, 2026 | 8:50 AM

తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామని మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకునే గ్యాంగ్‌ను గుణదల పోలీసులు ఛేదించారు. నకిలీ పోలీసుల వేషధారణలో బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురిని సోమవారం (మార్చి 23) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

విజయవాడ కానూరు మురళీనగర్‌లో నివసిస్తున్న ఓలి దుర్గాప్రసాద్‌కు సుమారు 8 నెలల క్రితం విక్రమ్ కుమార్ వర్మ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచయం పెరిగిన తర్వాత తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ స్నేహాన్ని బలపరిచాడు. ఈ క్రమంలో తక్కువ ధరకు బంగారం అందించే అవకాశం ఉందని ఆశ చూపించాడు. తనకు తెలిసిన వ్యక్తుల వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని, వారికి అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో మార్కెట్ ధర కంటే తక్కువకు అమ్మేస్తారని నమ్మబలికాడు.

విక్రమ్ మాటలు నిజమని నమ్మిన దుర్గాప్రసాద్, తన భార్య నగలను తాకట్టు పెట్టి, కొంత అప్పు చేసి మొత్తం రూ.15 లక్షలు సమకూర్చి వర్మకు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తర్వాత వర్మ మాట తప్పుతూ, బంగారం ఇవ్వకుండా కాలయాపన చేయడం ప్రారంభించాడు. పలుమార్లు అడిగినా వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్, తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో వారం రోజుల క్రితం వర్మ మరోసారి ఫోన్ చేసి.. చివరగా మంచి అవకాశం వచ్చింది అంటూ మళ్లీ వల వేశాడు. రూ.50 లక్షల విలువ చేసే బంగారం ఉందని, ఇప్పటికే ఇచ్చిన రూ.15 లక్షలకు మరో రూ.15 లక్షలు కలిపి ఇస్తే మొత్తం బంగారం నీకే ఇస్తానని చెప్పి మళ్లీ నమ్మబలికాడు…

ఈసారి మోసపోకుండా జాగ్రత్త పడిన దుర్గాప్రసాద్, బయటకు మాత్రం నమ్మినట్టు నటించి, డబ్బులు ఎక్కడికి తీసుకురావాలని అడిగాడు. ఇందుకు వర్మ ఇన్నర్ రింగ్ రోడ్ రెండో ఫ్లైఓవర్ వద్దకు రావాలని సూచించాడు. ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లిన దుర్గాప్రసాద్‌ను వర్మ డబ్బులు తెచ్చావా అంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. దుర్గాప్రసాద్ బంగారం ఎక్కడ ఉందని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగుతుండగా, అకస్మాత్తుగా ఆటోలో పోలీస్ దుస్తుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. కొండేటి హరికృష్ణ, పాగోలు సురేష్, చిన్నపత్తుల కిరణ్ కుమార్ లు పోలీసుల్లా నటిస్తూ ఇక్కడ ఏమవుతోంది అంటూ దుర్గాప్రసాద్‌ను బెదిరించారు. బంగారం, డబ్బుల పేరుతో కేసు పెడతామని భయపెట్టి అతని వద్ద ఉన్న రూ.5 వేల నగదు, మెడలోని వెండి గొలుసును లాక్కున్నారు. అంతేకాకుండా అతనిపై దాడికి కూడా పాల్పడ్డారు.

అప్పటికే అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్ ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించడంతో గుణదల పోలీసులు వేగంగా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని నకిలీ పోలీసుల ఆటకట్టించి నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసే గ్యాంగ్‌గా బయటపడింది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు గుణదల సీఐ వై. సత్య రమేష్ తెలిపారు. ప్రజలు తక్కువ ధరల పేరుతో వచ్చే ఇలాంటి ఆఫర్లకు మోసపోవద్దని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us