వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వజ్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సాధారణంగా తొలకరి వర్షాలు పడితే.. వ్యవసాయం కోసం పొలం దున్ని.. విత్తనాలు వేయడానికి రైతన్నలు రెడీ అవుతారు. కానీ.. ఆ ప్రాంతాల్లో మాత్రం.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. పలుగు, పార చేతపట్టి అందరూ పొలం బాట పడతారు. అయితే.. వ్యవసాయం చేయడానికి మాత్రం కాదు. కోటీశ్వరులు అయ్యేందుకు ఆ నేలలో అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ డ్రైవన్ పంట పండింది.
మట్టిలో దాగున్న అదృష్టపు మొలకల కోసం వెతుకుతుండగా, లక్ష్మీ దేవి తలుపు తట్టింది. డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రి మారిపోయింది. స్వయాన రైతు అయిన డ్రైవర్.. జీవన కష్టాల నుంచి గట్టెక్కి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. అతని జీవితం ధన్యమైంది. ఇలా దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఇందుకు గానూ 12 లక్షల రూపాయలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన బోయ రామాంజనేయులు అనే రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. బోయ రామాంజనేయులు, బోయ. శేఖర్లు అన్నదమ్ములు. ఇద్దరు తమకున్న రెండు ఎకరాల పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో పనులు లేనప్పుడు డ్రైవర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం పొలం పనులకు వెళ్లిన బోయ. రామాంజనేయులుకు ఓ రాయి దొరికింది. దొరికిన రాయిని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారికి చూపించాడు. ఇది వజ్రం అని తేల్చి 12 లక్షల రూపాయలు నగదు, 5తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు.
వీడియో చూడండి..
చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న తమకు వజ్రం దొరకడంతో తమ కష్టాలు తీరిపోయాయని బోయ రామాంజనేయులు అన్నారు. ఇలా ఒక్కరోజులోనే నగదు, బంగారం తమ ఇంటికి రావడంతో ఒక్క రోజుల్లోనే లక్షాధికారి అయిన రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలు రావడంతో దాదాపుగా ఇప్పటి వరకు 42 వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. వారానికి 4 నుండి 8 చొప్పున వజ్రాలు దొరుకుతుండడం విశేషం.
కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికేర ,పెరవలి, పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి, వంటి ప్రాంతాలలో వజ్రాల అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, బొంబాయి, వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. దొరికిన వజ్రాలను గుత్తి, జొన్నగిరి, పెరవలి, గ్రామాలకు చెందిన వజ్రాల వ్యాపారస్తులకు అమ్మి డబ్బులు తీసుకెళ్తున్నారు. అయితే దొరికిన వజ్రాలు ఎంత విలువ చేస్తాయో వజ్రాలు దొరికిన వారికి అవగాహన లేకపోవడంతో వజ్రాల వ్యాపారస్తులు ప్రజలను మోసం చేస్తూ ఎక్కువ విలువ చేసే వజ్రాలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఒకే ఒక్క వజ్రం దొరికితే తమ రాతలు మారిపోతాయని స్థానికులు ఆశపడుతున్నారు. చాలా మంది జొన్నగిరి ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..