మాజీ మంత్రి మల్లాడి (Malladi) కృష్ణారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. యానాంలోని వరద ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లిన ఆయన.. పడవలో నుంచి జారి నీళ్లలో పడ్డారు. వెంటనే అక్కడున్న వాళ్లు ఆయనను రక్షించి పడవలోకి ఎక్కించారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పడవలో వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన నీళ్లలో పడిపోయారు. అయ్యన్న నగర్ దగ్గర గోదావరి (Godavari) గట్టుకు గండిపడటంతో యానాం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఆడపడుచుల కాలనీ, వైఎస్సార్ నగర్, ఫరం పేటలో ఇళ్లు నీటమునిగాయి. కేవలం 30 నిముషాల్లోనే అబ్దుల్‌కలామ్ నగర్, అయ్యన్ననగర్, సుభద్రనగర్ రాధానగర్ పల్లపు ప్రాంతాల్లోకి నడుము లోతు నీళ్లు వచ్చాయి. అయ్యన్ననగర్ వద్ద ఉన్న స్లూయిజ్ ద్వారా వరద నీరు నీలపల్లి ప్రాంతాలకు వెళుతుండడంతో స్లూయిజ్ మూసివేశారు. కాగా.. యానాం నియోజకవర్గ పరిధిలో ముంపు ప్రాంతాలను మాజీ మంత్రి, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యటిస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటించి, బాధితులతో మాట్లాడారు. ముంపునకు గురైన ఇళ్లను ఆయన పరిశీలించారు.
కాగా.. గోదావరి పాయ అయిన గౌతమీ నది ఉద్ధృతితో యానాంలో కాలనీలు నీట మునిగాయి. నడుము లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో స్థానిక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత మండలాలలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జోగి రమేష్, హోం మంత్రి తానేటి వనిత, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌లు పర్యటించారు. అన్నంపల్లి ఆక్విడెక్ట్ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అమలాపురంలో వరద సహాయక చర్యలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..