Andhra: మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్..

ఏలూరు జిల్లాలో మహిళ అదృశ్యం కేసు దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తాళ్లపూడిలోని స్వీటు దుకాణంలో పనిచేసే వింటే ఆదిలక్ష్మి (36) సోమవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆమె తాడిపూడికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ యాకబ్‌ ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు.

Andhra: మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్..
Godavari River

Updated on: Sep 29, 2026 | 10:50 PM

ఏలూరు జిల్లాలో ఓ మహిళ అదృశ్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. పని ముగించుకుని ఇంటికి బయల్దేరిన మహిళ.. ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె చివరిసారిగా ఓ ఆటోలో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బంగారు ఆభరణాల కోసం మహిళను గోదావరిలోకి తోసినట్లు సమాచారం. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమకు చెందిన వింటే ఆదిలక్ష్మి (36) కొంతకాలంగా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఆమెకు సుమారు 20 ఏళ్ల క్రితం గోపాలపురం మండలం భీమోలుకు చెందిన సత్తిబాబుతో వివాహమైంది. అయితే ఏడేళ్ల క్రితం భర్త పాముకాటుకు గురై మృతి చెందారు. దీంతో ఆదిలక్ష్మి తిరిగి పుట్టింటికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.

కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఆదిలక్ష్మి తాళ్లపూడిలోని ఓ స్వీటు దుకాణంలో ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. అయితే రాత్రి అయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమెతో కలిసి పనిచేసే వారిని, పరిచయస్తులను అడిగి తెలుసుకున్నా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం ఆమె అన్నయ్య సత్యనారాయణమూర్తి తాళ్లపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజీతో బయటపడిన కీలక విషయం

అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు కొవ్వూరు గ్రామీణ సీఐ విజయబాబు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. ఆదిలక్ష్మి పనిచేసే స్వీటు దుకాణం నుంచి ఆమె వెళ్లిన మార్గంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాడిపూడికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ యాకబ్‌ ఆటోలో ఆమె ఒక్కరే ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆధారంతో మంగళవారం మధ్యాహ్నం యాకబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో తాళ్లపూడి నుంచి కొత్తపట్టిసీమ వైపు వెళ్తున్న సమయంలో ఆదిలక్ష్మి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని.. అనంతరం ఆమెను గోదావరి నదిలోకి తోసినట్లు వెల్లడైనట్లు తెలుస్తోంది.

గోదావరిలో కొనసాగుతున్న గాలింపు

ఆదిలక్ష్మి మెడలో సుమారు మూడు కాసుల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ఆభరణాల కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆచూకీ కోసం గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.మహిళ మృతదేహం లభ్యమైన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్‌ను విచారిస్తూ ఘటనకు సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us