
Eluru : చిన్న మాట ఇద్దరి ప్రాణాలను తీసింది.. మరో ఇద్దరిని మృత్యు ఒడివరకు తీసుకువెళ్లింది. దీనంతటికీ కారణం.. నిమ్మకాయలు.. పసుపు, కుంకుమ.. దారిలో నిమ్మకాయలు, కుంకుమ పడి ఉంటే తిట్టుకుంటూ వెళ్లిన మహిళపై బంధువే గొడ్డలితో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడటం కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నలుగురు మహిళలపై స్వయాన మేనల్లుడు గొడ్డలితో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కలపాల జీలుగులమ్మ (47), ఆమె తల్లి చుక్కమ్మ, కుమార్తెలు ధనలక్ష్మి స్థానిక ఎస్సీ పేటలో నివాసం ఉంటున్నారు. జిలుగులమ్మకు వరుసకు మేనల్లుడు వివేక్ తో పాటు అతని కుటుంబ సభ్యులతో పొలం తగాదాలు ఉన్నాయి. వీరికి వారసత్వంగా వచ్చిన ఎకరం 11 సెంట్లు పొలం విషయంలో జీలుగులమ్మ కు తన అన్న కుటుంబ సభ్యులతో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి..
ఇదే విషయమై మంగళవారం రాత్రి ఇరు కుటుంబాల మధ్య గొడవ చెల్లారేగడంతో.. వివేక్ ఇంట్లోని గొడ్డలిని తీసుకువచ్చి జిలుగులమ్మ, చుక్కమ్మలపై దాడి చేశాడు. అడ్డుకున్న వారి బంధువులు ధనలక్ష్మి, ఉషారాణిలపై సైతం వివేక్ దాడికి పాల్పడ్డాడు. ఘటనల జిలుగులమ్మ మృతి చెందగా.. చుక్కమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే ధనలక్ష్మి, ఉషారాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం ఇన్చార్జి డీఎస్పీ రవిచంద్ర, సిఐ సుభాష్ దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలు పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం హరిజన పేటలో గత రాత్రి జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
జిలుగులమ్మకు మొత్తం నలుగురు కూతుర్లు ఉన్నారు . వీరిలో ఉషారాణి, ధనలక్ష్గ్మి, కలపాల చిన్న తో పాటు మరో కుమార్తె ఉంది. వీరిలో చిన్న తన భర్తతో గొడవ పడి స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటికి వెళ్తున్న సమయంలో తన మేనమామ ఇంటిదగ్గర వీరు వెళ్లే దారిలో నిమ్మకాయలు , కుంకుమలు ఉండడంతో చేతబడి చేసి ఎవరో అక్కడ పడేసి ఉంటారని ఆమె తిట్టుకుంటూ ఇంటికి వెళ్లడంతో.. మేనమామ రాంబాబు కుమారుడు ముప్పుడి వివేక్ మరి కొంతమంది కలిసి జిలుగులమ్మ కుటుంబం పై దాడి చేసారు. గొడ్డలితో నరకడంతో ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఎకరం 1 భూమికి సంబంధించిన భూ వివాదం ఉంది.. అది కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో.. వారి ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని దాడి చేశారని అన్నారు. పరిసర ప్రాంతాలు పరిశీలించి క్లూస్ టీం ఆధారంగా హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..