Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి.. ఐదు టీడీపీ, ఒకటి జనసేన కైవసం..!

తిరుపతి డిప్యూటీ మేయర్‌ సహా పిడుగురాళ్ల , తుని వైస్‌ చైర్మన్‌, నందిగామ, పాలకొండ చైర్‌ పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆయా చోట్ల మంగళవారం(ఫిబ్రవరి 4) ఎన్నికలు జరుగుతాయి. జంపింగ్‌లు.. అలకల క్రమంలో ఇక సీన్‌ ఎలా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది.

Andhra Pradesh: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి.. ఐదు టీడీపీ, ఒకటి జనసేన కైవసం..!
Hindupur Municipality

Updated on: Feb 04, 2025 | 7:47 AM

ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 10నగరాల్లో ఎన్నికలు జరిగితే.. ఎన్నిక ప్రక్రియ పూర్తై ఫలితాలు ప్రకటించిన అన్ని చోట్ల కూటమి జయకేతనం ఎగురవేసింది. ఇక వాయిదా పడిన మరికొన్ని చోట్ల మంగళవారం(ఫిబ్రవరి 4) ఎన్నికలు జరుగుతాయి.

మున్సిపల్ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలో ఖాళీగా వున్న స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. పది చోట్ల ఎన్నికలు జరిగితే ఐదు చోట్ల ప్రక్రియ పూర్తైంది. క్యాంప్ రాజకీయాలతో ఉత్కంఠ రేపిన గుంటూరు కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఆరు స్థానాల్లో ఐదు టీడీపీ, ఒకటి జనసేన గెలిచాయి. గెలిచిన వారికి డిక్లరేషన్‌ ఫామ్స్ అందించారు కమిషనర్‌. కూటమి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

హిందూపురం మున్సిపల్ చైర్మన్‌ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. రమేష్‌ను చైర్మన్‌ కుర్చీలో కూర్చోపెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. జై బాలయ్య నినాదాలతో హిందూపురం హోరెత్తింది. అటు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి టీడీపీ ఖాతాలో పడింది. వైస్‌ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థిగా పగడాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మంత్రి పార్థసారథి సహా 18 మంది కౌన్సిలర్లు.. పగడాల సత్యనారాయణను వైస్‌ ఛైర్మన్‌గా ప్రతిపాదించారు. దాంతో..వైస్ చైర్మన్‌గా సత్యనారాయణ ఎన్నిక అయినట్లు అధికారులు ప్రకటించారు.

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. టీడీపీకి అనుకూలంగా 41, వైసీపీకి మద్దతుగా 21 ఓట్లు పడ్డాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 54 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులనూ టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్లుగా దుర్గా భవానీ, ఉమామహేశ్వరరావు నామినేషన్ వేశారు. వైసీపీ మాత్రం ఎన్నికను బహిష్కరించింది. రెండు నామినేషన్లు మాత్రమే రావడంతో వారిని డిప్యూటీ మేయర్లుగా ప్రకటించారు అధికారులు.

ఇదిలావుంటే, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ తిరుపతిలో పొలిటికల్‌ హీట్‌ పెంచింది. తమ కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. దీంతో కార్పొరేటర్లకు రక్షణ కలించాలని ఎస్పీని ఆదేశించింది కోర్టు. వైసీపీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. దీంతో తిరుపతి డిప్యూటీ మేయర్‌ సహా పిడుగురాళ్ల , తుని వైస్‌ చైర్మన్‌, నందిగామ, పాలకొండ చైర్‌ పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆయా చోట్ల మంగళవారం(ఫిబ్రవరి 4) ఎన్నికలు జరుగుతాయి. జంపింగ్‌లు.. అలకల క్రమంలో ఇక సీన్‌ ఎలా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..