Pawan Kalyan: చేతిలో నాలుగు సినిమాలు.. ముంచుకొస్తున్న ఎన్నికలు.. రేసులోకి పవన్ వచ్చేదెప్పుడు?

|

Apr 27, 2023 | 5:34 PM

ఏపీలోని ప్రధాన పార్టీలు అన్ని ఇప్పటికే ఎలక్షన్ మూడ్‌లోకి వచ్చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఫుల్ జోష్‌లో ఉంది. గడప గడపకు కార్యక్రమాలు, ఇంటింటికీ స్టికర్లు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తోంది. ఛాన్సొచ్చినప్పుడల్లా సీఎం జగన్.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అయితే..

Pawan Kalyan: చేతిలో నాలుగు సినిమాలు.. ముంచుకొస్తున్న ఎన్నికలు.. రేసులోకి పవన్ వచ్చేదెప్పుడు?
‘‘వైసీపీ నేతలు ‘నువ్వే మా నమ్మకం జగనన్న’ అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జగనన్నపై ప్రజలకు నమ్మకం లేదు. వైసీపీ పాలనను ప్రశ్నించిన యువతను ఆ పార్టీ నాయకులు హింసిస్తున్నార’ని నాదెండ్ల పేర్కొన్నారు.
Image Credit source: TV9 Telugu
Follow us on

పవన్ కల్యాణ్.. ఏపీ రాజకీయాలు ఆయన చుట్టూ తిరగని రోజు లేదు. అధికార పార్టీ అయినా.. ప్రతిపక్షమైనా… ఆయన కలుస్తానంటే కాదనే వాళ్లు లేరు. ఆయన అవునంటే ఏం జరిగిందో… కాదంటే ఏం జరిగిందో.. ఏపీలో అందరి కన్నా టీడీపీకి బాగా తెలుసు. 2014లో కలిసి పోటీ చేశారు. ఏపీలో అధికారంలోకొచ్చారు. అదే టీడీపీ 2019లో కాదని వదిలేసింది. అధికారం కూడా ఆ పార్టీని వదిలేసింది. అందుకే రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అంత ప్రియారిటీ ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆయనకు ప్రియారిటీ ఎక్కువగానే ఉంది… ఏపీలో ప్రధాన పార్టీల గెలుపు ఓటముల్ని తారుమారు చెయ్యగల ప్రభావం ఉంది.. జనసేన కార్యకర్తలు ఊహిస్తున్నట్టు అన్నీ కలిసొస్తే అధికారంలొకి రావచ్చన్న ఆశా… ఉంది. మరి అందుకు తగ్గ యాక్షన్ ప్లాన్ ఉందా..? అన్నదే ఇప్పుడు ప్రశ్న.

ఏపీలోని ప్రధాన పార్టీలు అన్ని ఇప్పటికే ఎలక్షన్ మూడ్‌లోకి వచ్చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఫుల్ జోష్‌లో ఉంది. గడప గడపకు కార్యక్రమాలు, ఇంటింటికీ స్టికర్లు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తోంది. ఛాన్సొచ్చినప్పుడల్లా సీఎం జగన్.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఏపీ ప్రజలకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చెయ్యని రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామంటూ గణాంకాలతో సహా చెబుతున్నారు. పార్టీ నేతలతో రివ్యూ మీటింగ్లు, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు… మొత్తంగా గ్రాస్ రూట్‌ నుంచే ఎన్నికల కోసం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టి చాలా రోజులయ్యింది. నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే విషయంలో వెనకబడ్డ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే జగన్ గట్టి వార్నింగ్‌లు కూడా ఇచ్చేశారు. చంద్రబాబు ప్రాతినిధ్యంవహిస్తున్న కుప్పంతో సహా  ‘వై నాట్ 175’ అంటూ పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేసేశారు.

ప్రతిపక్షం టీడీపీ గురించి స్పెషల్‌గా చర్చించక్కర్లేదు. చంద్రబాబు సభలతో అధికార పార్టీపై విరుచుకుపడుతుంటే.. కొడుకు లోకేష్ ఇప్పటికే 1000 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర పూర్తి చేసి ఆన్ ద వేలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం పుణ్యమా అని చాలా రోజుల తర్వాత ఏదో ఒక రూపంలో సక్సెక్ అన్న మాట విన్న టీడీపీ ఇప్పుడు మరింత జోష్‌లో ముందుకెళ్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల జోష్‌తో.. ‘వై నాట్ పులివెందుల’ అంటూ వైసీపీ నినాదానికి కౌంటర్ ఇస్తోంది టీడీపీ.

ప్రస్తుతానికి ఏపీలో బీజేపీ ఎంత మేర ప్రభావం చూపుతుందో ఆ పార్టీ లీడర్లతో సహా అందరికీ ఓ అంచనా ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సై అంటూ కార్యాచరణ కూడా ప్రకటించింది. కిరణ్ కుమార్ కి కాషాయ కండువా కప్పి ఎన్నికల కోసం ఏపీలో చేరికలను షురూ చేస్తున్నట్టు బీజేపీ హింట్ ఇచ్చేసింది. టీడీపీ, వైసీపీ రెండూ దొందూ దొందే అంటూ బీజేపీ నేతలు ఆ పార్టీలకు సమదూరం పాటిస్తూ దూసుకుపోతున్నాయి. ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనని ధీమాగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

ఆ రకంగా.. ప్రధాన పార్టీలు ఎవరి స్టైల్లో వాళ్లు వచ్చే ఎన్నికల కోసం వార్ మొదలుపెట్టేశాయి. మరి ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని 9 ఏళ్ల నుంచి పోరాడుతున్న పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫుల్ టైం పాలిటిక్స్‌కి టైం స్పెండ్ చేస్తున్నారా..? ఈ విషయం అందరి కన్నా ఆయన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. ఒకప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఫుల్ టైం పొలిటీషన్‌గా స్థిరపడిపోతానని ప్రకటించినప్పటికీ.. తర్వాత తర్వాత అనేక కారణాల వల్ల మళ్లీ సినిమాలు కూడా చెయ్యడం మొదలెట్టారు. సిల్వర్ స్క్రీన్‌పై సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. చేస్తున్నారు కూడా.. మరి పాలిటిక్స్‌లో ఎప్పుడొస్తుంది ఆ సక్సెస్. ఇంకా ఎన్నికలకు గట్టిగా ఏడాది కూడా లేదు. మరి ఏమిటి ఆయన ప్లాన్ అన్నది అర్థంకావడం లేదు.

చేతులో చూస్తే ఇంకా నాలుగు సినిమాలున్నాయి. అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్‌ మూవీ రిలీజ్‌కి ముహూర్తం పెట్టేసినా.. ఇంకా క్రిష్ దర్శకత్వంలోని హరిహర వీరమల్లు, సముద్రఖని డైరక్షన్లో వినోదాయ సిత్తం, సుజిత్ దర్శకత్వంలో ఓజీ ఇలా మొత్తం 3 సినిమాలున్నాయి. క్షణం తీరిక లేకుండా వాటిని శరవేగంగా పూర్తి చేయడంలో పవన్ బిజీ బీజీగా ఉన్నారంటూ ఆయన ఫ్యాన్ పేజెస్‌లో రకరకాల షెడ్యూల్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యకుండా షెడ్యూల్ మీద షెడ్యూల్ పెట్టుకొని వాటిని ఫినిష్ చేసే పనిలో ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఉన్న సినిమాలు త్వరగా పూర్తి చెయ్యాలన్న ఆయన కమిట్మెంట్‌ను ఎవ్వరూ కాదనరు. అలా చెయ్యాలి కూడా. అభిమానులు కోరుకునేది అదే. కానీ మరి ఆయన్ను నమ్ముకున్న పార్టీ కార్యకర్తల పరిస్థితేంటి..? మిగిలిన పార్టీలన్నీ ఓట్లు కోసం వేట మొదలెట్టేసినా పవన్ కల్యాణ్ ఇంకా మేకప్- ప్యాకప్ అంటూ కెమెరా చూట్టూ తిరుగుతుంటే ఎలా..?

ఆయన ఫైట్ మొదలుపెడితే.. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా సూపర్ హిట్టే… అది ఇప్పటం కావచ్చు.. అమరావతిపై కావచ్చు.. ఇసుక మాఫియా పేరుతో ఫైట్ కావచ్చు…. వారాహి వెహికల్‌ విషయంలో ప్రత్యర్థులు పంచ‌్‌లు వేసినప్పుడు కావచ్చు. కానీ సమస్యల్లా… ఆయన ప్రత్యర్థులు ఎగతాళి చేసినట్టు… అప్పుడప్పుడు కనిపించి వెళ్లిపోతూ ఉండటమే ఏపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులు కాంట్రాక్టులు చేస్తే తప్పులేనప్పుడు.. ఓ యాక్టర్‌గా తాను సినిమాలు చెయ్యడం ఎలా తప్పవుతుందని పవన్ గతంలోనే చెప్పారు. పవన్ వెర్షన్ ముమ్మాటికీ రైటే కావచ్చు.. కానీ ఎన్నికల టైం దగ్గరపడుతోంది కదా… ఇంకా పవన్ కథన రంగంలోకి దిగకపోవడమే ఇప్పుడు సగటు కార్యకర్త ఆందోళన.

నిన్న మొన్నటి వరకు బీజేపీ పెద్దలిచ్చే రూట్ మ్యాప్ కోసం వెయిటింగ్ అన్నారు. ఆ తర్వాత టీడీపీ ఎంటరయ్యేసరికి రెండు పార్టీల మధ్య కావాల్సినంత దూరం పెరిగింది. ఆ విషయం ఎవరో చెబితే ఏపీ జనం నమ్మేవారు కాదేమో.. కానీ సాక్షాత్తు ఏపీ బీజేపీ నేతలే మీడియా ముందుకొచ్చి ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నా లేనట్టుగానే ఉందని ఆక్రోశించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పవన్ ఢిల్లీ వెళ్లడంతో కమలనాథులతో కయ్యం కాస్త చల్లారిపోయినట్టే కనిపించింది. ఢిల్లీలో బీజేపీ నేతలు పవన్‌కు ఏం రూట్ మ్యాప్ ఇచ్చారో కానీ.. ఆ తర్వాత నుంచి ఆయన సైలెంట్‌గా సినిమాలు పూర్తి చెయ్యడంలో తెగ బీజీ అయిపోయారు.

పూజలతో ఆగిపోయిన వారాహి యాత్ర ఎంత వరకు వచ్చిందో తెలియదు… ఎంత వేగంగా పూర్తి చేసినా చేతులో ఉన్న నాలుగు సినిమాలు పూర్తి చెయ్యడానికి ఇంకా కనీసం 3 నెలలైనా పడుతుంది. అప్పటికి ఎన్నికలకు 6-7 నెలలకు మించి పెద్దగా టైం కూడా ఉండదు. పోనీ ఆయన కాకపోతే… పార్టీని జనాల్లోకి ఆయన రేంజ్‌లో తీసుకెళ్లే నేతలు ఎవ్వరైనా పార్టీలో ఉన్నారా అంటే అదీ లేదు. నాదెండ్ల మనోహర్ అయినా.. అన్న నాగేంద్రబాబైనా పవన్ ఉన్నప్పుడు పవర్ జనరేటర్స్. వినడానికి కాస్త కష్టమనిపించినా అది జగమెరిగిన నిజం.

సాధారణంగా జనసేన అఫిషీయల్ యూట్యూబ్‌లో వాళ్ల పార్టీ నేతల అధికారిక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ ఉంటారు. అందులో చూస్తే రెండు రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ భీమవరంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కనిపించిన వీడియో ఉంది. అంతకు ముందు సరిగ్గా 12 రోజుల క్రితం కర్నూలులో జరిగిన రాయలసీమ రీజియన్ మీటింగ్లో దర్శనమిచ్చిన వీడియో కూడా ఉంది. ఇక నాగబాబు విషయానికి వస్తే వారం క్రితం నిర్వహించిన ఓ ఇఫ్తార్ విందులోనూ అంతకు ముందు వారం క్రితం ఆయన్ను జనసేన ప్రధాన కార్యదర్శిగా నియామకం జరిగిన తర్వాత ఓ వీడియోలో కనిపించారు. పవన్ కల్యాణ్ ఇటీవల పాల్గొన్న సభ, సమావేశం ఏదైనా ఉందంటే అది వరంగల్‌ నిట్‌లో ఇచ్చిన గెస్ట్ లెక్చర్ మాత్రమే. జనసేనలో ప్రముఖులుగా భావించిన మిగిలిన నేతలు అప్పుడప్పుడు టీవీ చర్చల్లో కనిపించడం తప్ప మిగిలిన పార్టీల నేతలు చేసే స్థాయిలో హడావుడి ఉండదు. అందుకు కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ప్రత్యర్థి పార్టీలతో సమానంగా ఢీ కొట్టాలంటే ఆ రేంజ్‌లో పని చెయ్యాలి కదా..! అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. మరి రాజకీయంగా పవన్ తదుపరి వేసే అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగామారింది.

ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న ఓ పార్టీ… జనంలోకొచ్చి 9ఏళ్లను పూర్తి చేసుకున్న పార్టీ… ఎన్నికలు ఇంకా ఏడాది కూడా లేని టైంలో ఇంత స్లోగా ఉంటే ఎలా అన్నది.. సగటు జనసేన కార్యకర్తల మాట. పవన్ సినిమాలు పూర్తి చేసేదెప్పుడు?  పూర్తి స్థాయిలో యుద్ధం మొదలుపెట్టేదెప్పుడు..? అధికార ప్రతిపక్షాలను ఢీ కొట్టేదెప్పుడు..? జనంలోకి వెళ్లేదెప్పుడు..? ఇవి జనసేన కార్యకర్తలను, పవన్ అభిమానులు తొలిచేస్తున్న ప్రశ్నలు. ఎన్నికలు ముంచుకొస్తున్నందున జనసేనాని వెంటనే కథన రంగంలోకి దిగి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలన్నది ఆ పార్టీ సాధారణ కార్యకర్తల ఆశ.. ఆకాంక్ష..

– రవికుమార్ పాణంగిపల్లి, టీవీ9 తెలుగు (డిజిటల్)