
టంగుటూరు, జులై 17: టంగుటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగళ్ల కీర్తి (24) ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన పాపినేని సాయితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ప్రస్తుతం సాయి ఖతార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ తమ ఉద్యోగాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తరచూ కలుసుకుంటూ వచ్చారు.
అయితే ఇటీవల సాయి కుటుంబ సభ్యులు అతనికి మరో యువతితో వివాహం నిశ్చయించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కీర్తి తననే వివాహం చేసుకోవాలని సాయిని కోరగా, ఈ అంశంపై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయాన్ని కీర్తి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు సాయి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఒంగోలులోని సాయి బంధువుల ఇంట్లో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగినప్పటికీ, సాయి వివాహానికి అంగీకరించకపోవడంతో కీర్తిని ఓదార్చి తిరిగి ముంబైకి పంపించారు.
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి జూలై 14న తన తల్లిదండ్రులకు కాన్ఫరెన్స్ కాల్ చేసింది. ఆ కాల్‌లో సాయి కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన మరణానికి సాయే కారణమని చెబుతూ, తాను నివసిస్తున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, సాయి పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించారు. గదిలోకి వెళ్లి చూడగా కీర్తి ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదిలా ఉండగా, సాయి ఖతార్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో కీర్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ముంబై నుంచి నేరుగా పొందూరులోని సాయి ఇంటి వద్దకు తీసుకువచ్చారు. సాయి మోసం చేయడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ, ఆమె చివరి కోరిక మేరకు సాయితో తాళికట్టించి అతడే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరు కుటుంబాలతో పాటు గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. సాయి ఖతార్ నుంచి రావడానికి సమయం పడుతుందని, తమ కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహిస్తామని అతడి బంధువులు తెలిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పొందూరులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.