
కూరగాయలు భగ్గుమంటున్నాయి. ఏది పట్టుకున్నా కిలో వందను టచ్ చేస్తోంది. ఐదొందల నోటు బైటికి తీస్తే చేతిసంచి కూడా నిండడం లేదు. ఏదో ఆల్టర్నేటివ్ ఉంది కదా అని కోడిగుడ్డు వైపు చూద్దామన్నా అది కూడా టచ్‌మీ నాట్ అంటోంది. ఎస్.. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు కొండెక్కి కూర్చుంది. చవకైన పౌష్టికాహారం కదా అని నాలుగ్గుడ్లు తెచ్చుకుని ఉడకేసుకుందామంటే మధ్యతరగతి కుటుంబాలకు అదీ కూడా అందను పొమ్మంటోంది.
నమ్మండి నమ్మకపోండి… ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర 8 రూపాయలు. గత నెలలో ఇదే గుడ్డు 6 రూపాయలు. ఇప్పుడు ఎనిమిదైంది. మరో నెలరోజులాగితే ఎంతౌతుందో అంచనాలకు అందడం లేదు. రోగనిరోధక శక్తి పెరుగుతుందని రోజుకొక గుడ్డు తినడం అలవాటుగా మార్చుకోవాలని డాక్టర్లు చెబుతారు. కానీ, కోడిగుడ్డు ధరలు మాత్రం అందుబాటులో లేవు. హైదరాబాద్ మార్కెట్లలో 100 గుడ్ల ధర 645 రూపాయలు. రవాణా ఖర్చులూ గట్రా కలిపి రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ఎనిమిది రూపాయలు పలుకుతోంది. సడన్‌గా గుడ్డు ధరలు ఎందుకు పెరిగాయో తెలుసుకుందాం పదండి..
వింటర్ సీజన్లో వేడెక్కింది కోడిగుడ్డు ధర. ఎందుకంటే కోడిగుడ్డుకు శరీరంలో ఉష్ణాన్ని పెంచే స్వభావం ఉంది. చలికాలం కావడంతో పౌష్టికాహారమైన గుడ్డును తినే తీరాలన్న అవగాహన కూడా జనంలోపెరిగింది. వారంలో ఒకరోజు మాంసాహారం వండుకున్నా, మూణ్ణాలుగు రోజులు కోడిగుడ్డు వంటకం తప్పనిసరి. మాంసం, కూరగాయల ధరలు పెరగడం మరో కారణం. మాంసాహారులకు, ఎక్కువమంది శాకాహారులక్కూడా కోడిగుడ్లే ప్రత్యామ్నాయం అయ్యాయి.
చలికాలం కనుక నార్త్ ఇండియాలో గుడ్ల వినియోగం అమాంతం పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయి. ఇటీవల ఏపీ, తెలంగాణలో అంతుబట్టని వ్యాధులతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో సహజంగానే కోడి గుడ్ల ధర కొండెక్కిందంటోంది పౌల్ట్రీ పరిశ్రమ. ఒక్కో గుడ్డు ధర 8 రూపాయలు దాటిపోవడంతో కొనుగోళ్లు తగ్గి, వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇంకాఇంకా పెరిగి పదిరూపాయలకు చేరొచ్చన్న అంచనాలు బెంబేలెత్తిస్తున్నాయి.
కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి రెండు స్థానాలూ తెలుగు రాష్ట్రాలవే. ఉత్పత్తిలోనే కాదు, వినియోగంలో కూడా మనమే టాప్. తెలంగాణలో రోజుకు దాదాపు మూడు కోట్ల గుడ్లు ఉత్పత్తి ఐతే, అందులో 2 కోట్లకుపైగా కోడిగుడ్లు ఇక్కడే అమ్ముడౌతాయి. ఇప్పుడు ధరలు పెరగడంతో, మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ కూడా మనవే మరి.