Diviseema Uppena: ఎన్ని ఏళ్ళు అయినా కొన్ని చేదు జ్ఞాపకాలను తలచుకుంటే చాలు ఇప్పటికీ ప్రజలు ఉల్కిపడుతూనే ఉంటారు. చరిత్రలో గుర్తుండే తేదీ నవంబర్ 19. అవును 1977 నవంబర్ 19 తేదీ యావత్ భారతదేశాన్ని కదిలించిన రోజు… వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయిన కాళరాత్రి.. పకృతి ఉగ్రరూపం దాల్చిన వేళ దివిసీమ ఉప్పెన ధాటికి బలి అయి నేటికి 44 ఏళ్లు.. అవును నవంబర్ 14 గుర్తుకొస్తే చాలు.. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా ప్రజలు ఇప్పటికీ ఉల్కిపడతార. దివిసీమకు ఉప్పెన చేసిన గాయాన్ని తలచుకుంటూ అదిరిపడతారు. 44 ఏళ్ల క్రితం ప్రకృతి చేసిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ కంట కన్నీరు పెడతారు. ఆధునిక విజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో చరిత్ర చూడని పెను ప్రళయం.. ప్రకృతి విలయం.. లెక్క రాని వేలాదిమందికి మింగేసిన ఉప్పెన.. అనేక లక్షల మందిని చెట్టుకు ఒకరిని.. పుట్టకు ఒకరిని చేసిన విపత్తు.. లక్షలాది పశువుల ఉసురు తీసిన తుఫాను.. దివిసీమ ఉప్పెన.
1977 నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయింది. మేఘాలు నల్లగా మారడంతో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే మర్నాడు నవంబర్ 19న నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన దివిసీమ ఉప్పెన.. బీభత్సం సృష్టించింది. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒక్కసారిగా తీరం దాటిన ప్రళయ తుఫాను గ్రామాలపై పెను విధ్వంసం సృష్టించింది. హోరుగాలికి , రాకాసి అలలకు వేలాది మంది ప్రజలు బలయ్యారు. కుళ్లిపోయిన మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు జరిగాయి. ఈ తుఫాన్ సృష్టించిన విధ్వసంలో అధికారికంగా 14,204 మంది, అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 వేల ఎకరాలకు పైబడి పంట నష్టం జరిగింది. వీటితో పాటు ఆస్తి నష్టం కూడా కోట్లలో జరిగినట్లు అంచనావేశారు. దివిసీమ ఉప్పెనని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ అక్కడివారు ఉల్కిపడతారు.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వపరంగా ఆదుకున్నారు. అనేక స్వచ్చంద సంస్థలు తమ వంతుగా సాయం అందించారు. ఆనాటి శాసనసభ్యులు మండలి వెంకట కృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలవడంతో పాటు చెదిరిపోయిన దివిసీమకు పూర్వ వైభవం తీసుకురావడానికి విశేష కృషి చేశారు. ఎవరు ఎంత సాయంచేసినా కోలుకోలేని విలయం ఉప్పెన. అందుకే ఇప్పటికీ ‘దివిసీమ ఉప్పెన’ అనే పదం.. కృష్ణ జిల్లా వారిని ఉలిక్కిపడేలా చేస్తోంది. అయితే ఈ ఉప్పెన తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్ర ప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేసారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు.