Andhra Pradesh: కర్ణాటకకు చెందిన ఆమె ఏపీకి మంత్రి ఎలా అయ్యారు? మళ్లీ టికెట్‌ ఇస్తే..

Minister Ushasri Charan: ఆమె రాష్ట్రానికి మంత్రి అయినా మా నియోజకవర్గానికి కాదు అంటున్నారు అక్కడి నేతలు. కర్ణాటక నుంచి వచ్చి మాపై పెత్తనం చెలాయిస్తామంటే ఇక కుదరదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఆమె ఏపీకి మంత్రి ఎలా అయ్యారు? గెలిపించిన నేతలు ఇప్పుడెందుకు అడ్డం తిరిగారు?

Andhra Pradesh: కర్ణాటకకు చెందిన ఆమె ఏపీకి మంత్రి ఎలా అయ్యారు? మళ్లీ టికెట్‌ ఇస్తే..
Minister Usha Sri Charan

Updated on: Jun 19, 2023 | 3:46 PM

మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదృష్టం కలిసొచ్చి మంత్రికూడా అయ్యారు. కానీ జరిగిందేదో జరిగింది.. ఇక ఒక్క అడుగుకూడా వేయనివ్వమంటున్నారు సొంత పార్టీ నేతలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి ఎన్నికైన మంత్రి ఉషశ్రీ చరణ్ రచ్చ గెలిచారేమోగానీ సొంతింట్లో మాత్రం సవాళ్లు ఎదుర్కుంటున్నారు. అధినేత దృష్టిలోపడి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నా స్థానిక నేతలను మాత్రం మంత్రి ఉషశ్రీ మెప్పించలేకపోయారన్న అపవాదు ఉంది.  లోకల్… నాన్ లోకల్‌గా విడిపోయారు కళ్యాణదుర్గం వైసీపీ నాయకులు. మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ లోకల్ ముద్ర వేస్తోంది అసమ్మతి వర్గం. మంత్రి ఉషశ్రీ చరణ్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగరేశారు. నిన్నటిదాకా కళ్యాణదుర్గంలో ఏకచత్రాధిపత్యం చలాయించిన మహిళామంత్రికి స్థానిక నాయకుల నుంచి సవాళ్లు మొదలయ్యాయి. చాప కింద నీరులా విస్తరించిన అసమ్మతి ఇప్పుడు తారాస్థాయికి చేరింది. మంత్రి ఉషశ్రీ స్థానికురాలు కాదంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో లోకల్ నాన్‌లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చారు కొందరు నేతలు.

నాన్‌లోకల్‌ నాయకురాలికి 2019లో టికెట్‌ ఎలా ఇచ్చారు..ఆమె ఎలా గెలిచారన్నది పక్కనపెడితే.. ఇప్పుడామె స్థానికత్వమే అసమ్మతికి ఆయుధంగా మారింది. ఎక్కడో కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి వచ్చిన ఉషశ్రీ చరణ్‌కి మరోసారి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామంటూ అల్టిమేటం ఇస్తున్నారు అమెను వ్యతిరేకిస్తున్న నాయకులు. 2024లో ఉషశ్రీ చరణ్‌ని ఎలాగైనా నియోజకవర్గంనుంచి సాగనంపుతామంటున్నారు స్థానిక వైసీపీ నేతలు. తాజాగా కళ్యాణదుర్గంలో స్థానిక నాయకులంతా కలిసి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయే తిప్పేస్వామి ఇంట్లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య కేడర్‌ ఈ మీటింగ్‌కి హాజరయ్యారు. నాలుగేళ్లుగా మంత్రి ఉషశ్రీ చరణ్ సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులని కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడి, అక్రమంగా కేసులు పెట్టించారనరి స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా అసమ్మతివర్గం ఏకంగా ప్రత్యేక సమావేశం పెట్టుకోవడం.. ఇన్నాళ్లూ ఎదురులేదనుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్‌కి మింగుడు పడడం లేదు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల కేడర్‌ ఉషశ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు ఈ సమావేశంతో అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు స్థానిక నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధిపత్యాన్ని అంగీకరించబోమని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మంత్రి ఉషశ్రీ చరణ్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరికలు చేసేదాకా వెళ్లింది అసమ్మతి. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను లోకల్ నాయకులే వేరుగా నిర్వహిస్తామని ప్రకటించారు. స్థానికంగా ఉన్న ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని.. ఉషశ్రీ చరణ్‌కి టికెటిస్తే మాత్రం కచ్చితంగా ఓడిస్తామన్న అసమ్మతినేతల హెచ్చరికలతో కళ్యాణదుర్గంలో లోకల్ నాన్ లోకల్ వార్ తారాస్థాయికి చేరింది. ఇదే పాయింట్‌తో టీడీపీలో మొదలైన అసమ్మతి అధికారపార్టీలో కూడా అలజడి రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..