Andhra Pradesh: ప్రమాదాలు చెప్పిరావు.. మన నిర్లక్ష్యం ఫలితమే కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడికి వెళ్లడం ప్రమాదమని తెలిసినా.. సరదా కోసం వెళ్లి ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకుంటారు కొంతమంది. సాధారణంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తారు. డేంజర్ బోర్డులు పెట్టి.. అవసరమైతే అటువైపు ఎవరూ వెళ్లకుండా భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే తెలియక ఎవరైనా అటువైపు వెళ్తే అడ్డుకోవడానికి.. లేదా నిబంధనలు అతిక్రమిస్తే అధికారులు వెంటనే అలర్ట్ అవుతారు. ఎవరు పట్టించుకోకపోతే.. ఇంకేముంది.. సరదాగా వెళ్లి అపాయాన్ని కొన్ని తెచ్చుకుంటుంటారు కొందరు. అసలు విషయానికొస్తే.. తిరుమలకు రోజూ వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించేటప్పుడు ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే వెహికల్ ఆపేసి కాసేపు ఆఅందాలను ఆస్వాదించాలనే ఆశ కలుగుతుంది. కొంతమంది అయితే కొద్దిసేపు ఘాట్ రోడ్డులో పక్కకు వాహనం ఆపి.. ఫోటో షూట్ కు రెడీ అయిపోతారు. అయితే ఇదే ఘాట్ రోడ్డులో కొన్ని డేంజరస్ ప్లేస్ లు ఉన్నాయి.
ప్రజల భద్రత దృష్ట్యా అక్కడికి ప్రవేశాన్ని టీటీడీ అధికారులు నిషేధించారు. ఇందులో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మాల్వాడి గుండం వాటర్ ఫాల్స్ ఒకటి. ఈవాటర్ పాల్స్ దగ్గరకు వెళ్తే అపాయం అని చెప్పి.. ఎవరైనా అత్యుత్సాహం చూపిస్తే ప్రమాదం పొంచిఉందనే ఉద్దేశంతో ఇక్కడకి ప్రవేశాన్ని నిషేధించారు. అయినాసరే భక్తులు మాత్రం మాల్వాడి గుండం వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లి సరదాగా చిందులు వేస్తున్నారు. నిషేధిత ప్రాంతమైనప్పటికీ మాల్వాడి గుండం వాటర్ ఫాల్స్ దగ్గర భక్తుల డ్యాన్సులు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిషేధిత ప్రాంతం వద్ద ఎవరినైనా భద్రత కోసం నియమించి.. అక్కడకు వెళ్లకుండా అడ్డుకుంటారు. కాని ఇక్కడ పట్టించుకునే వారు ఎవరూ లేకపోవడంతో భక్తులు ఈవాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లి యదేచ్ఛగా డాన్సులు చేస్తూ వీడియోలు షూట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కంటే.. జరగకముందే టీటీడీ అధికారులు మేల్కొని.. నిషేధిత ప్రాంతంలోకి భక్తులను అనుమతించకూడదని పలువురు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..