ఎందుకు మహాలక్ష్మి ఇలా చేశావ్.. అప్పుల బాధతో కన్న పిల్లలకు విష గుళికలు ఇచ్చి..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం ఎం. బీరేపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి మహాలక్ష్మి, కుమారుడు రిషిత్ మృతి చెందగా, కుమార్తె శ్రీనిధి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం ఎం బీరేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోగా మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. బియ్యపు పిండిలో క్రిమిసంహారక గుళికలు కలిపి కొడుకు కూతురుకు తినిపించి.. తాను కూడా తిని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎం బీరేపల్లికి చెందిన ముద్దప్ప, మహాలక్ష్మి దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు సంతానం.. తోపుడు బండి పై పసుపు కుంకుమ వ్యాపారం చేసుకుంటూ దంపతులిద్దరూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల వ్యాపారం సరిగా జరగక ముద్దప్ప మహాలక్ష్మి దంపతులు అప్పులు చేశారు. అయితే అప్పులు ఇచ్చినవారు తిరిగి డబ్బులు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో.. అప్పుల బాధ తట్టుకోలేక భార్య మహాలక్ష్మి చనిపోవాలని నిర్ణయించుకుంది.
అయితే, భర్త ఇంట్లో లేని సమయంలో భార్య మహాలక్ష్మి పిల్లలకు బియ్యపు పిండిలో గుళికల మందు కలిపి తినిపించింది. అనంతరం అదే గుళికల మందు కలిపిన పదార్థాన్ని తల్లి మహాలక్ష్మి కూడా తిన్నది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న తల్లీబిడ్డలను గమనించిన స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తల్లి బిడ్డలను అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలోనే తల్లి మహాలక్ష్మి కుమారుడు రిషిత్ చనిపోయారు.
ప్రస్తుతం మృతురాలు మహాలక్ష్మి కుమార్తె శ్రీనిధి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఒకే కుటుంబంలో తల్లి కొడుకు మృతి చెందడం.. కూతురు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో బీరేపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఓవైపు అప్పుల బాధ.. మరోవైపు తాను చనిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్న ఆవేదనతో మహాలక్ష్మీ పిల్లలకు కూడా విష గుళికలు తినిపించినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
