Andhra Pradesh: అయేషాకు ఏమైంది..? ఫ్రెండ్స్ పిలిచారని వెళ్లిన యువతి.. ఆ తర్వాత..

స్నేహితులు పిలిచారని స్కూటీ వేసుకుని నవ్వుతూ వెళ్లిన యువతి.. మరుసటి రోజు ఉదయానికే చెరువు గట్టున విగతజీవిగా తేలింది. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో 22 ఏళ్ల షేక్ ఆయేషా అనుమానాస్పద మృతి తీవ్ర సంచలనం రేపుతోంది. ఒంటిపై తీవ్రగాయాలు చూస్తుంటే ఇది ముమ్మాటికీ ఘోర హత్యేనని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ స్నేహితులు ఎవరు? అసలు అక్కడ ఏం జరిగింది? అనేది తెలుసుకుందాం..

Andhra Pradesh: అయేషాకు ఏమైంది..? ఫ్రెండ్స్ పిలిచారని వెళ్లిన యువతి.. ఆ తర్వాత..
Darsi Missing Woman Ayesha Found Dead

Edited By:

Updated on: Oct 08, 2026 | 9:10 PM

జిల్లా దర్శి పట్టణంలో 22 ఏళ్ల యువతి షేక్ ఆయేషా అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. స్నేహితులు పిలిచారని బయటకు వెళ్లిన యువతి.. మరుసటి రోజు ఉదయానికే చెరువు సమీపంలో శవమై తేలడం స్థానికంగా సంచలనంగా మారింది. ఒంటిపై తీవ్ర గాయాలు, చేయి విరిగి ఉండటం చూస్తుంటే ఇది ముమ్మాటికీ హత్యేనని తల్లిదండ్రులు, స్థానికులు అనుమానిస్తున్నారు. దర్శి పట్టణానికి చెందిన షేక్ రహమత్‌బాషా కూతురు ఆయేషా (22) డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల 5న మధ్యాహ్నం స్నేహితులు రమ్మంటున్నారని చెప్పి తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే రాత్రి అవుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు రాత్రి తండ్రి రహమత్‌బాషా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఒంటిపై రక్తగాయాలు.. హత్య కోణంలో అనుమానాలు

పోలీసులు గాలిస్తుండగానే, మరుసటి రోజు ఉదయం దర్శి సమీపంలోని ఎన్‌ఏపీ చెరువు వద్ద ఒక యువతి మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అది ఆయేషా మృతదేహంగా నిర్ధారించారు. ఆమె మృతదేహం పక్కనే ఆమె ప్రయాణించిన స్కూటీ కూడా లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం.. ఆయేషా ఒంటిపై తీవ్ర రక్తగాయాలు ఉన్నాయి. ఒక చేయి విరిగిపోయిన స్థితిలో కనిపించింది. చెంపపై బలంగా ఎవరో కొట్టినట్లు కమిలిన గాయాలు ఉన్నాయి. ఈ ఆనవాళ్లన్నీ చూస్తుంటే ఆమెపై ఎవరో దాడి చేసి హత్య చేశారన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

మిస్టరీగా మారిన స్నేహితుల పాత్ర.. పోలీసుల దర్యాప్తు

సంఘటన జరిగిన రోజు ఆయేషా స్కూటీ వద్ద కొంతమంది యువతులు, యువకులు ఉన్నట్లు స్థానికులు గమనించినట్లు సమాచారం. స్నేహితుల మధ్య ఏదైనా వివాదం చెలరేగి ఆమెను హత్య చేసి చెరువు వద్ద పడేశారా? లేదా స్నేహితుల వేధింపులు, తీవ్ర మనస్తాపం కారణంగా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందా?
అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయేషా కాల్ డేటా రికార్డులు, చివరిగా ఆమె ఎవరితో మాట్లాడింది అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

తన కుమార్తెది ముమ్మాటికీ హత్యేనని, స్నేహితుల ముసుగులో ఆమెను తీసుకెళ్లి దారుణంగా పొట్టనబెట్టుకున్నారని తండ్రి బాషా కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన నిందితులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. డిగ్రీ చదివి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న యువతి ఇలా విగతజీవిగా మారడంతో దర్శి పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us