Cyclone Alert: ఏపీకి హైఅలెర్ట్.. ఈ రాత్రికే తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర తుపాను ముప్పు ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మురసు ఒంగోలు దిశగా వేగంగా కదులుతోంది. మరికొద్ది గంటల్లోనే తీరం దాటనుండటంతో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు సహా పలు జిల్లాల్లో పెనుగాలులతో కూడిన అతిభారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతం వణికిపోతోంది.

Cyclone Alert: ఏపీకి హైఅలెర్ట్.. ఈ రాత్రికే తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు
Cyclone Murasu High Alert

Updated on: Nov 02, 2026 | 7:04 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు తీవ్ర తుపాను శరవేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గడచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తీవ్ర తుపాను, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం.. మురసు తీవ్ర తుపాను ప్రస్తుతం నెల్లూరుకు కేవలం 80 కిలోమీటర్లు, కావలికి 90 కిలోమీటర్లు, ఒంగోలుకు 120 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్లు, తిరుపతికి 160 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తీరానికి సమీపిస్తున్న కొద్దీ సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారింది.

గంటకు 120 కి.మీ వేగంతో పెనుగాలులు.. కుండపోత వర్షాలు

తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యే ముప్పు ఉండటంతో విద్యుత్, రవాణా శాఖలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.

ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి: ప్రఖర్ జైన్

తుపాను ముప్పు నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తుపాను తీరం దాటే కీలక సమయంలో ప్రజలెవరూ బయటకు రావద్దని, పక్కా భవనాలు లేదా ప్రభుత్వ సహాయ పునరావాస కేంద్రాల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ప్రభావిత జిల్లాల్లో రంగంలోకి దిగి సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us