Covid Guidelines: భవానీ దీక్షా పరులకు ఆలయ అధికారులు కొవిడ్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు పలు సూచనలను చేశారు. ఈ నెల 5 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షా విరమణ గిరి ప్రదక్షణలను నిలిపివేశామన్నారు. కేశఖండన శాల, నదీ స్నానాలు, జల్లు స్నానాలు ఉండవని తెలిపారు.
దీక్షా పరులు ఇరుముడులను దేవస్ధానానికి సమర్పించి అనంతరం మాల విరమణను వారి వారి స్వగ్రామాల యందు గురు భవానీల సమక్షంలో విరమణ చేసుకోవాలని సూచించారు. భవానీ దీక్షా విరమణ రోజుల్లో రోజుకు పది వేల మందికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తామన్నారు. 5 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ వల్ల అంతరాలయ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. పది సంవత్సరాల లోపు పిల్లలకు 60 సంవత్సరాల పైబడిన వారికి అమ్మవారి దర్శనానికి అనుమతి ఉండదని వెల్లడించారు.