ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన సత్తెనపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర హై డ్రామా నడుస్తోంది. ఆఫీస్ నుంచి గత రాత్రి కంప్యూటర్ల చోరికి గురికావడం సంచలనం రేపింది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్ తరలించిన సందర్భంగా వాటిని తన ఆఫీసులకు తరలించుకున్న వివాదం మరింత ముదురుతోంది. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే సమయంలో ఫర్నిచర్‌ను కొత్త అసెంబ్లీకి కాకుండా తన క్యాంప్ ఆఫీస్‌లకు తరలించుకున్నట్లు కోడెల ఇప్పటికే అంగీకరించారు. వాటిని ప్రభుత్వానికి అప్పగిస్తానని కూడా చెప్పారాయన. అయితే తప్పు జరిగినట్లు కోడెల అంగీకరించారని, ఇలాంటి వ్యవహారాలు కోడెలకు కొత్త కాదని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నాయకులు.
మరోవైపు కోడెల క్యాంప్ ఆఫీస్ నుంచి కంపూటర్లు, ఫర్నిచర్‌ను అసెంబ్లీ సిబ్బంది స్వాధీనం చేసుకుందామనుకుంటున్న తరుణంలో గత రాత్రి పది గంటల సమయంలో సత్తెనపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌కు ఇద్దరు దుండగులు వచ్చి కంపూటర్లను ఎత్తుకెళ్ళారు. దీనిపై ఆఫీస్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి పోలీసులు వచ్చి ఆఫీస్‌ను పరిశీలించి వెళ్లారు. అయితే ఈ ఉదయం వెతికితే కోడెల ఇంటి సమీపంలోనే కంపూటర్లు దొరికాయి. కార్యాలయ సిబ్బంది వాటిని తిరిగి లోనికి తీసుకెళ్ళారు. కంప్యూటర్లలోని డేటా చోరీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.