తిరగబడ్డ వెండితెర బొమ్మ.. మూతపడుతున్న థియేటర్లు!

ఒకప్పుడు జన సందడితో కళకళలాడిన సినిమా థియేటర్లు నేడు బోసిపోతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, పైరసీ వెబ్‌సైట్లు, విపరీతంగా పెరిగిన టికెట్ ధరలు, ఆహారపు ఖర్చులు థియేటర్ల మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. కరోనా ప్రభావంతో వందల థియేటర్లు మూతపడగా, సామాన్యుడి వినోదానికి దూరం అయ్యే పరిస్థితి నెలకొంది.

తిరగబడ్డ వెండితెర బొమ్మ.. మూతపడుతున్న థియేటర్లు!
Cinema Theater

Edited By:

Updated on: Apr 25, 2026 | 9:40 PM

సమ్మర్‌ హాలిడేస్‌ వచ్చాయంటే చాలు సినిమా థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయిపోతుంటాయి.. అయితే అది గతం. ప్రస్తుతం సామాన్యుడి వినోద సాధనం సినిమా నేడు ప్రేక్షకాదరణ కోల్పోతోంది. థియేటర్లకు వచ్చి సినిమా చూసేవారు తగ్గిపోవడంతో టికెట్లు అమ్ముడు పోవడం లేదు. వారాంతాల్లో కూడా పెద్ద తెరలు బోసిపోతున్నాయి. ఓటీటిలు, పైరసీ వెబ్‌ సైట్లు వెండితెరను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వందల కోట్లతో తీసిన పెద్ద హీరోల సినిమా కూడా కంటెంట్‌ లేకపోతే ప్రేక్షకులు థియేటర్లవైపు కూడా వెళ్ళడం లేదు. మొత్తం మీద కరోనా కారణంగా జనంలోకి దూసుకొచ్చిన ఓటీటీల దెబ్బకు సినిమా థియేటర్లు మూసుకునే దిశగా వెళుతుండటంతో సామాన్యుడి వినోదానికి కట్‌ చెప్పాల్సి వస్తోంది. అదనపు సౌకర్యాల పేరుతో, సినిమా బడ్జెట్‌ పెరిగిందన్న సాకుతో, టికెట్‌ రేట్లను విపరీతంగా పెంచేయడం కూడా ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకంగా మారడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఏవి తల్లి నిరుడు కురిసిన పూల జల్లు..

వినోదమే ప్రధాన ఆకర్షణగా అందరినీ ఓ చోటికి చేర్చే సినిమా హాళ్లు నేడు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాయి. తొలితరం చిత్తూరు నాగయ్య, మలితరం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఆ తరువాత కృష్ణ, శోభన్‌బాబు నుంచి చిరంజీవి వరకు గత 70 ఏళ్ళుకు పైగా సినీ ప్రేక్షకుల హృదయాల్లో దేవాలయాలుగా గూడుకట్టుకున్న సినిమా హాళ్ళు నేడు బోసిపోయే దశకు చేరుకున్నాయి. అప్పట్లో ప్రజలకు సినిమా తప్ప మరో కాలక్షేపం లేకపోవడంతో పట్టణాల నుండి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రదర్శించే ప్రతి షో ప్రేక్షకులతో కిటకిట లాడేది. దీంతో పాటుగా సినిమా హాళ్ళ లోని సైకిల్ స్టాండ్, పార్కింగ్, క్యాంటీన్లు కూడా మంచి ఆదాయాన్ని సంపాదించిపెట్టేవి. ఇక వారాంతపు సెలవులు, పండుగలు, పబ్బాలు, వేసవికాలపు శెలవుల్లో సినిమా హాళ్లు ప్రేక్షకుల సందడితో జాతర వాతావరణాన్ని సంతరించుకునేవి. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ ఇలా థియేటర్ల లోని ఏ విభాగం ఖాళీగా కనిపించేవి కావు. ఇక బ్లాక్ టికెట్లు అమ్ముకునేవారికి సినిమా హాళ్లు ఓ మంచి ఆదాయ వనరుగా ఉండేది. వీళ్ళతో పాటుగా థియెటర్ సిబ్బంది, ప్రచారానికి తిరిగే సినిమా రిక్షాలు ఇలా ఎన్నో విభాగాలకు చెందిన వారికి సినిమా థియేటర్లు అన్నం పెట్టాయి.

కాలానుగుణంగా మారినా పెరగని ఆదరణ..

మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతకాలం తర్వాత సినిమా హాళ్ళలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజల అవసరాలకు అనుకూలంగా ఉండేందుకు అన్ని రకాల కొనుగోళ్ళను ఓ చోటుకు చేర్చి దానికి మల్టీప్లెక్స్ అనే పేరును మార్చి సింగిల్ థియేటర్ల కలెక్షన్స్ కు అడ్డుకట్ట వేశాయి. మల్టీప్లెక్స్ రాకతో ప్రేక్షకులు సినిమా చూసే విధానం కూడా మారిపోయింది. వ్యాపార సముదాయం, ఆహారం, వినోదం అన్ని ఒకే చోట ఏర్పడడంతో మల్టీప్లై క్స్‌ ధియేటర్లు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్ళలో వీటికి పూ ర్తిస్థాయిలో జనాదరణ దక్కింది. ఆ తర్వాత ప్లాస్మా, ఎల్ ఈ డీ, ఎల్ సీ డీ ,స్మార్ట్ టివి అంటూ రకరకాల హోం థియేటర్లు అందుబాటులోకి రావడంతో సినిమా హాళ్లకు క్రమంగా ప్రేక్షకాదరణ తగ్గుతూ వచ్చింది.

కరోనా, టీవీ సీరియళ్ళ ప్రభావం..

ఇటీవల కాలంతో పెరిగిన టీవీ సీరియల్స్ కూడా మహిళా ప్రేక్షకులను సినిమా హాళ్ళకు దూరం చేశాయి. ఏళ్ళ తరబడి సాగే టీవీ సిరియళ్ళలో మహిళలే హీరోలు, విలన్లుగా సాగే సాగతీత ఎపిసోడ్లు మహిళలను టీవిలకు కట్టిపడేశాయి. ఇక కరోనా పీరియడ్లో సినిమా థియేటర్ల పరిస్థితి పూర్తిగా అథమ స్థాయికి చేరుకుంది. కరోనా నుంచి ప్రజలు బయట పడ్డాక రాష్ట్రంలో కొన్ని వందల థియేటర్లు షాపింగ్ మాల్స్, కళ్యాణ మండపాల అవతారమెత్తాయి. కొన్ని థియేటర్లయితే గోడౌన్లుగా, కోళ్ళఫారంలుగా మారిపోయాయని ధియేటర్ల యజమానులు వాపోతున్నారు.

థియేటర్ల పునాదులు పెకలించిన ఓటిటి – పైరసీ..

సినిమా ప్రియులకు ఇంటి నుంచే వినోదాన్ని అందించేందుకు వచ్చిన ఓటీటీలు సినిమా థియేటర్ల పునాదులను పూర్తిగా పెకలించాయనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌ వంటి ఓటీటీలు అధికారకంగా, ప్రజల నుంచి సబ్‌స్క్రిక్షన్‌ వసూలు చేస్తూ సినిమాలను అందిస్తుంటే, మరోవైపు పైరసీలతో ఐబొమ్మ, బప్పం టివి, మూవీరూల్జ్‌, యో మూవీస్‌ వంటి పైరసీ వెబ్‌ సైట్లు పైసా ఖర్చు లేకుండా కొత్త కొత్త సినిమాలను ప్రక్షకుల చేతుల్లో సినిమాను పెట్టేస్తున్నాయి. ఈ క్రమంలో సినిమాను నమ్ముకుని, అమ్ముకుని జీవనం సాగించే ఎన్నో కుటుంబాలు తమ జీవనాధారం కోసం థియేటర్లను వదిలి ఇతర ఆదాయమార్గాలను వెతుక్కుంటున్నారు. ఒక్క ఒంగోలులోనే గతంలో 18 ధియేటర్లు ఉంటే నేడు వాటిలో సగం మూసేసి ఆపార్ట్‌మెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారు.

దేశంలోనే ఏపిలో అధిక థియేటర్లు..

భారతదేశంలోనే అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 వందలకు పైగా సినిమా థియేటర్లు ఉన్నాయి. పల్లెటూర్ల నుంచి మెట్రో పాలిటిన్‌ సిటీల వరకు సినిమా ధియేటర్లలో ఎక్కువగా వినోదాన్ని ప్రజలు వెతుక్కుంటారు. ఒకవైపు ఓటీటీలు, పైరసీ వెబ్‌ సైట్ల కారణంగా ప్రేక్షకులు ధియేటర్లకు దూరమవుతుంటే మరోవైపు సినిమా టికెట్‌ రేట్లను పెంచడం కూడా ధియేటర్ల మనుగడను దెబ్బతీస్తోంది. అంతేకాకుండా ఇంటర్‌వెల్‌లో ధియేటర్లలో అమ్మే తినుబండారాలు, కూల్‌డ్రింక్‌ రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రేక్షకుడు ధియేటర్లకు రావడం లేదని చెబుతున్నారు.

పెరిగిన టికెట్‌ ధరలు..

సామాన్యుడి సగటు వినోదానికి వేదికైన సినిమా థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేసింది ఒకవైపు ఓటీటీలు, పైరసీ వెబ్‌ సైట్లు కారణంగా ఉంటే మరోవైపు పెరిగిన ధరలు కూడా మరో కారణంగా ఉంటుందనేది అందరి అభిప్రాయంగా ఉంది. ఒక రైతు తన పంటను పండించేందుకు ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించలేని ప్రభుత్వాలు, ఎక్కువ బడ్జెట్‌తో సినిమా తీశారన్న కారణంగా టికెట్‌ ధరలను ఇష్టారీతిన పెంచుకునే విసులుబాటులు కల్పించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Follow Us