Bullet Train: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్.. రూట్ ఫిక్స్.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం

ఏపీకి మరో బుల్లెట్ ట్రైన్ రానుంది. చెన్నై-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు కారిడార్‌ను బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారిడార్ చెన్నై నుంచి చిత్తూరు జిల్లా మీదుగా బెంగళూరుకు వెళ్లనుంది. దీంతో కారిడార్ పూర్తైతే ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ తిప్పనున్నారు.

Bullet Train: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్.. రూట్ ఫిక్స్.. ఈ ప్రాంతాల మీదుగా ప్రయాణం
Bullet Train

Updated on: Feb 03, 2026 | 9:46 AM

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైళ్ల కారిడార్ ప్రతిపాదనను బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల గుండా మూడు కారిడార్లు ప్రకటించింది. ఇక హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయి. బెంగళూరు, చెన్నై వెళ్లే కారిడార్లు అమరావతి మీదుగా వెళ్లనుండగా.. చెన్నై-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్లనుంది. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల రాకతో భవిష్యత్తుల్లో ఏపీ రూపులేఖలు మారనున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతికి కనెక్టివిటీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక ప్రతిపాదన చేశారు. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్‌కు సంబంధించి చిత్తూరు-తిరుపతి మధ్య 75 కిలోమీటర్ల వ్యూహత్మక కనెక్టివిటీ ఇవ్వాలని సూచించారు.

చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్

చిత్తూరు-తిరుపతి మధ్య కనెక్టివిటీ ఇస్తే అది బెంగళూరు-అమరావతి కారిడార్‌కు ఎంతో మేలు చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు చంద్రబాబు సూచించారు. దీని వల్ల అమరావతి, బెంగళూరు మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. దీని వల్ల బెంగళూరు-అమరావతి మధ్య బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుంది. బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా అమరావతికి బుల్లెట్ రైలు నడవనుంది. దీని వల్ల అమరావతికి రెండు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చినట్లు ఉంటుంది. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం కూడా ఓకే చెప్పే అవకాశముందని తెలుస్తోంది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌ అమరావతి మీదుగా వెళ్లనుంది. దీంతో హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోపే చేరుకోవచ్చు. ఇక చెన్నైకు 2.55 గంటల్లోనే చేరుకోవచ్చు.

గంటలోనే అమరావతికి..

ఇక హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌ కూడా ఏపీ మీదుగా వెళ్లనుంది. దీని వల్ల హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 2 గంటల్లోనే ప్రయాణాలు చేయవచ్చు. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ చిత్తూరు మీదుగా వెళ్తుంది. దీని వల్ల బెంగళూరు నుంచి చెన్నైకు 1.13 గంటల్లో చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ కారిడార్లు పూర్తయితే ఆయా ప్రాంతాల మధ్య బుల్లెట్ రైళ్లను తీసుకొస్తారు. ఇవి గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎలివేటెడ్ కారిడార్ల విధానంలో వీటిని నిర్మించనున్నారు. దీంతో ప్రజలకు కింద సులువుగా తిరగవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ల రాకతో వేగవంతమైన ప్రయాణమే కాకుండా కొత్త పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అలాగే రాష్ట్రాల ఆర్ధికాభివృద్దికి కూడా ఇవి తోడ్పాటు అందించనున్నాయి. ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం ఏకంగా రూ.వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది.