Chandrababu: టీడీపీ(TDP) అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికలలో తొలి అభ్యర్థిని అధికారికంగా బహిరంగ సభలో ప్రకటించారు. డోన్ నుంచి టిడిపి తరఫున ధర్మవరం సుబ్బా రెడ్డి(Dharmavaram Subba Reddy) పోటీ చేస్తారని ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు చేసిన ప్రకటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో(Kurnool Distrcit) రాజకీయ సంచలనం అయింది. డోన్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులు పోటీ చేయాలని ఒత్తిడులు డిమాండ్లు వస్తున్న సందర్భంలో.. జలదుర్గం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
వాస్తవంగా 1985 నుంచి డోన్ నుంచి కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులే పోటీ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా డోన్ లో చంద్రబాబు పర్యటన లో కేఈ కుటుంబీకులు ఎవరు కూడా కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతకంటే ఆశ్చర్యకరమైన విధంగా డోన్ టిడిపి అభ్యర్థిగా సుబ్బారెడ్డిని ప్రకటించడం సంచలనం అయింది. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కు డోన్ టిడిపి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేయడం బహిరంగంగా సుబ్బారెడ్డి ని విమర్శించడం, విమర్శించిన వారికి టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఆ తరువాత ఏకంగా సుబ్బారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం, సుబ్బారెడ్డి నాయకత్వంలోనే అందరూ పనిచేయాలని బహిరంగ సభలోనే చంద్రబాబు చెప్పడం రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. చంద్రబాబు చేసిన ప్రకటనపై మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కుటుంబీకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..