Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలు గురించి ఈ విషయాలు మీకు తెల్సా..? ఒకప్పుడు అక్కడ…

|

Sep 11, 2023 | 6:59 PM

ఏపీ సీఐడీ, పోలీస్ అధికారులు చంద్రబాబు లాంటి వీవీఐపీని ఖైదు చేసేందుకు అస్సలు ఈ జైలే ఎందుకు ఎంచుకున్నారు..? అసలు రాజమండ్రి సెంట్రల్ జైలుకున్న ప్రత్యేకతలేంటి..? దాని చరిత్రేంటి..? ఎన్ని ఎకరాల్లో ఈ జైలు ఉంది.. సెక్యూరిటీ వ్యవస్థ ఎలా ఉంటుంది..? చంద్రబాబు భద్రతపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... అధికారులు ఇస్తున్న సమాధానం ఏంటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైలు గురించి ఈ విషయాలు మీకు తెల్సా..? ఒకప్పుడు అక్కడ...
Chandrababu in Rajahmundry Central Jail
Follow us on

రాజమండ్రి సెంట్రల్ జైలు. ఏపీ సీఐడీ, పోలీస్ అధికారులు చంద్రబాబు లాంటి వీవీఐపీని ఖైదు చేసేందుకు అస్సలు ఈ జైలే ఎందుకు ఎంచుకున్నారు..? అసలు రాజమండ్రి సెంట్రల్ జైలుకున్న ప్రత్యేకతలేంటి..? దాని చరిత్రేంటి..? ఏపీ జైళ్ల శాఖ తన వెబ్‌సైట్లో పొందుపరచిన వివరాల ప్రకారం ఈ కట్టడం ఒకప్పుడు ఈ దేశానికి బ్రిటిష్ వారి కన్నా ముందు వలస వచ్చిన డచ్ వారి కోట. 1602లో ఈ కోటను వారు నిర్మించారు . బ్రిటీష్ సామ్రాజ్యం దీనిని 1864లో స్థానిక జైలుగా మార్చింది. మొదట ఈ జిల్లా జైలలో 72 సెల్స్ ఉండేవి. ఆ తర్వాత 1870లో దీన్ని సెంట్రల్ జైలుగా మార్చింది బ్రిటిష్ సర్కారు. ఆ రోజుల్లో కనీస అవసరాలైన శానిటేషన్, తాగునీరు, సరైన వెంటిలేషన్ వంటివి ఏవీ ఈ జైల్లో ఉండేవి కావు. అప్పట్లో కోస్తా, రాయలసీమ, మద్రాసు ప్రాంతాల్లో జీవిత ఖైదు పడిన ఖైదీలను శిక్షించేందుకు ఈ జైలును వినియోగించేది బ్రిటిష్ సర్కారు.

మొత్తం ఈ జైలు 196 ఎకరాల్లో విస్తరించి ఉంది, ఇందులో 37.24 ఎకరాల్లో భవనాలున్నాయి. ఎటు నుంచి చూసినా జైలు మొత్తం కనిపించేలా మధ్యలో ఓ టవర్ ఉంటుంది. అలాగే 8 వేర్వేరు సెల్స్, బ్యారక్ ఈ సెంట్రల్ టవర్‌ నుంచి కనిపించేలా ఉంటాయి. అందువల్ల జైలు అధికారులు, సిబ్బంది ఖైదీల కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించే అవకాశం ఉంటుంది. ఈ జైల్లో 9వ బ్లాక్‌ను 1956లో మహిళా జైలుగా మార్చారు. 2010లో 26 కోట్ల ఖర్చుతో పురాతన భవనాల స్థానంలో కొత్తవి నిర్మించారు.

రాష్ట్రంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్గిన జైళ్లలో ఇది కూడా ఒకటి. విశాలమైన జైలు కావడం, భద్రత విషయంలో పెద్దగా సమస్యలు లేకపోవడం వల్లే చంద్రబాబుకు ఈ జైలును కేటాయించారు. తాజాగా చంద్రబాబు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీపీ కోర్టులో టీడీపీ వేసిన పిటిషన్ పై కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత, అత్యున్నత వైద్య సౌకర్యాలు ఈ జైల్లో ఉన్నాయని కోర్టు ఎదుట కూడా స్పష్టం చేశారు.  జైలు బయటా, లోపల పోలీసుల భద్రత ఉందన్నారు. పోలీసులు 24 గంటలూ డ్యూటీలో ఉంటారని వెల్లడించారు. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ ప్రత్యేక కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ అరెస్ట్ చేయాలని ఆయన తరఫు లాయర్ల వేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. న్యాయమూర్తి కాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.