
లిఫ్ట్ ఇస్తానని నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కోవడానికి యత్నించిన ఓ దుండగుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేటసన్నెగండ్ల గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ, అమరావతి సమీపంలోని తాళ్లూరులో ఉంటున్న తన కోడలిని ఇంటికి తీసుకొచ్చేందుకు బయలుదేరింది. ప్రయాణంలో భాగంగా పిడుగురాళ్ల బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి నన్ను గుర్తుపట్టలేదా? అంటూ పలకరించాడు. ఆమె ఎప్పుడూ చూడలేదే అని చెప్పినప్పటికీ.. పలానా బంధువుల తరఫు వాడినంటూ నమ్మబలికాడు. మాటల్లో పెట్టి ఇటువైపు బస్సులు రావు, నేను అటువైపే వెళ్తున్నాను.. బండిపై దింపుతాను రండి అని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన మరియమ్మ అతడి బైక్ ఎక్కింది.
పిడుగురాళ్ల దాటిన తర్వాత పందిటివారిపాలెం సమీపంలోకి రాగానే బండి ఆపిన నిందితుడు, మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పాడు. దీంతో మరియమ్మ బండి దిగి రోడ్డు పక్కన నిలబడింది. ఆ సమయంలో వెనుక నుంచి ఒక్కసారిగా వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును బలంగా లాగాడు. అప్రమత్తమైన బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఇద్దరూ పక్కనే ఉన్న కందకంలో పడిపోయారు. పెనుగులాటలో ఆమె మెడలోని బంగారు గొలుసు రెండు ముక్కలైంది. తనను ఏమీ చేయవద్దంటూ ఆమె కేకలు వేస్తూ ప్రాధేయపడింది.
అదే సమయంలో బైక్‌పై అటుగా వెళ్తున్న దంపతులు బాధితురాలి ఆర్తనాదాలు విని వెంటనే అక్కడికి చేరుకున్నారు. మరియమ్మ కాపాడండి అని వేడుకోవడంతో వారు క్షణాల్లో స్పందించి నిందితుడి బైక్ తాళాలు లాక్కున్నారు. అప్పటికే స్థానికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. నిందితుడు వారితో వాగ్వివాదానికి దిగి, తప్పుడు కథలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు మరియమ్మ తనపై జరిగిన దాడిని వివరిస్తూ, తెగిపోయిన రెండు ముక్కల బంగారు గొలుసును పోలీసులకు అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి వివరాలు, అతనిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.