Cage Culture: ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ.. చేపల పెంపకంలో కేజ్ కల్చర్ పై కొత్త పాలసీ తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం

చేపల సాగులో కొత్త పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం కేజ్ కల్చర్ విధానంలో చేపల సాగును చేపట్టే విధంగా అడుగులు వేస్తోంది.

Cage Culture: ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ.. చేపల పెంపకంలో కేజ్ కల్చర్ పై కొత్త పాలసీ తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం
Cage Culture
KVD Varma

|

Apr 30, 2021 | 12:32 AM

Cage Culture: చేపల సాగులో కొత్త పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం కేజ్ కల్చర్ విధానంలో చేపల సాగును చేపట్టే విధంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ప్రత్యెక పాలసీ తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే దీనికి అవసరమైన చర్యలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న సాగు కేజ్‌ కల్చర్‌ను 2007లో రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ సాగుకు చాలా విశేషాలు ఉన్నాయి. దీనికి గజం భూమి కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టక్కర్లేదు. తరచూ నీరు మార్చాల్సిన పనిలేదు. విద్యుత్‌ అవసరం అసలే లేదు. కూలీల భారం పెద్దగా లేనేలేదు. మరి ఎలా దీనిని సాగు చేస్తారంటే.. సముద్రం, నదుల్లోనే కాకుండా అన్నిరకాల చెరువుల్లోనూ ఈ రకమైన చేపల సాగు చేయొచ్చు. ఖర్చు తక్కువతో ఎక్కువ రాబడిని సంపాదించవచ్చు. మన పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం మంచి ఫలితాలు ఇచ్చింది. ఇప్పడు దీనిపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లాలని చూస్తోంది.

కేజ్ తయారీ ఇలా..

6 మీటర్ల వృత్తంతో 4 మీటర్ల లోతున ప్రత్యేకంగా తయారు చేసిన పంజరంలో చేపలను సాగుచేస్తారు. ఇది తేలడానికి పంజరం కింద డ్రమ్‌లు, లోపల చేపలు పెంచేందుకు ఓ వల, బయట రక్షణ వలయంగా మరో వల ఏర్పాటు చేస్తారు. కనీసం 5 మీటర్ల లోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీటిని వరదలు, తుఫాన్‌లు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. విశాఖ సముద్ర తీరంలో 30, సూర్యలంకబీచ్‌లో 10 మెరైన్‌ కేజ్‌లు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో 110 బ్యాక్‌వాటర్‌ కేజ్‌లు ఉన్నాయి.

కృష్ణా జిల్లా కేజ్ కల్చర్..

కృష్ణాజిల్లా నాగాయలంకలో అత్యధికంగా 70కు పైగా కేజ్ లు ఉండడంతో కేజ్‌ కల్చర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆ ప్రాంతం నిలిచింది. ఈ సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన (పీఎంఎంఎస్‌వై) ద్వారా 60:40 నిష్పత్తిలో ఈ సాగుకు చేయూతనిస్తున్నాయి. ఖర్చులు పోను మెరైన్‌ కేజ్‌ ద్వారా ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బ్యాక్‌వాటర్‌ కల్చర్‌ ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది.

ఏపీలో కేజ్‌ కల్చర్‌ విస్తరణకు అవకాశాలున్నాయంటున్నారు సీఎంఎఫ్‌ఆర్‌ఐ విశాఖ రీజనల్‌ సెంటర్‌ హెడ్‌ డాక్టర్‌ సుభాదీప్‌ఘోష్. సుదూరమైన సముద్రతీర ప్రాంతంతోపాటు పొడవైన కృష్ణా, గోదావరి బ్యాక్‌వాటర్‌ ప్రాంతం ఏపీలో ఉండటం అనుకూలాంశం. అంతేకాకుండా పెద్ద ఎత్తున రిజర్వాయర్లున్నాయి. ప్రత్యేకంగా కేజ్‌ కల్చర్‌ పాలసీని తీసుకొస్తే అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సీఎంఎఫ్‌ఐఆర్‌ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. కాగా కేజ్ కల్చర్ విస్తరణకు ఉన్న అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందనీ, త్వరలో కొత్త పాలసీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, మత్స్య శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు.

Also Read: Kidney disease: ఊర్లకు ఊర్లనే మింగేస్తున్న మహమ్మారి.. ఏ ఇంటిని కదిలించిన రక్తకన్నీరే.. 13 మండలాలను వణికిస్తున్న భూతం..!

Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ.. వ్యతిరేకిస్తూ డైరక్టర్ల తీర్మానం… హైకోర్టును అశ్రయిస్తామన్న కొత్త చైర్మన్‌!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu