ఏపీలో పొత్తుల పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ, జనసేన రంగం సిద్ధం చేసుకుంటున్నా కమలనాథుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. చంద్రబాబు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినా పవన్ కల్యాణ్‌కు మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్ మెంట్ అందడం లేదు. దీంతో ఈ ట్రయాంగిల్ పొలిటికల్ పొత్తుల పంచాయితీ ముగింపు ఎప్పుడో అర్థం కాని స్థితి నెలకొంది.
ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా ఏపీలో ఇంకా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. వైసీపీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేనకు బీజేపీ అధినాయకత్వం మనసులో ఏముందో ఇంకా తెలియడం లేదు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు పొత్తులకు తాము సిద్ధమనే సంకేతాలను అధిష్టానానికి పంపారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. దీంతో పొత్తులు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా ఏ ప్రకటన వెలువడలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశమైనా ఇంకా ఏ నిర్ణయమూ వెలువడలేదు.
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటోన్న బీజేపీ సొంతంగా 370 చోట్ల గెలుస్తామంటోంది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాల్లో విజయం లభించబోతోందని కమలనాథులు జోస్యం చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయేలోకి మరిన్ని పార్టీలు రాబోతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వెల్లడించడంతో ఏపీలో పొత్తులపై వెంటనే ప్రకటన రావొచ్చని అంతా భావించారు. అయితే గతంలో టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ తర్వాత నిందలు వేసి పొత్తు తెంచుకున్న నేపథ్యంలో అలా మరోసారి జరగకుండా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. జనసేన విషయంలో ఒక అంచనాకు వచ్చాక పొత్తులపై ముందుకు వెళ్ళాలని బీజేపీ చూస్తోంది. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇంకా పిలవకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు పొత్తుల విషయంలో బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని ఏపీ బీజేపీ నేతలంటున్నారు. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అన్నది తెలియలేదన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈసారి అవ్వ కావాలి.. బువ్వ కావాలి అంటే కుదరకపోవచ్చని ట్వీట్‌లో పేర్కొన్నారు. టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విషయంలో పూర్తి స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ కేంద్ర నాయకత్వం. మరోవైపు ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై త్వరగా ప్రకటన వెలువడాలని మూడు పార్టీల క్యాడర్ కోరుకుంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..