BJP: సార్వత్రిక సమరానికి కాషాయదళం సన్నద్ధం.. మరి తెలుగుస్టేట్స్‌కు రోడ్‌మ్యాప్‌ వచ్చేనా?

|

Jan 16, 2023 | 7:55 PM

కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ తర్వాత సార్వత్రిక సమరం నేపథ్యంలో కాషాయదళం యుద్ధానికి సిద్ధమవుతోంది..

BJP: సార్వత్రిక సమరానికి కాషాయదళం సన్నద్ధం.. మరి తెలుగుస్టేట్స్‌కు రోడ్‌మ్యాప్‌ వచ్చేనా?
BJP
Follow us on

కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఆ తర్వాత సార్వత్రిక సమరం నేపథ్యంలో కాషాయదళం యుద్ధానికి సిద్ధమవుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేడర్‌కు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేయబోతుంది. అంతా ఓకే కానీ… తెలుగు రాష్ట్రాల్లో అనుసరించే వ్యూహాలపైనే ఉన్న సందిగ్ధంపై స్పష్టత ఇస్తారా అన్నదే కీలకంగా మారింది.

ఫిబ్రవరి, మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో, మేలో కర్నాటక, నవంబర్‌లో మిజోరం, డిసెంబర్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇవి పూర్తి అయిన నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలుంటాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎలక్షనీరింగ్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించనున్నారు. మిగతా రాష్ట్రాల సంగతెలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలు మాత్రం హైకమాండ్‌ నుంచి రోడ్‌మ్యాప్‌ కోసం ఎదురుచేస్తున్నాయి.

ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన పక్కచూపులు చూస్తోంది. పొత్తు ఉందని నేతలు చెప్పడమే కానీ కేడర్‌ మాత్రం ఎక్కడా కలిసిపనిచేయడం లేదు. ఉమ్మడి ఉద్యమాల ఊసే లేదు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీతో పవన్‌ భేటి అనంతరం కలిసే ఉన్నామని బీజేపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పవన్‌ మాత్రం టీడీపీ వైపు చూస్తున్నారు. స్థానిక నేతలు కూడా రకరకాల ప్రకటనలతో ఇక్కడ గందరగోళం నెలకొంది. దీంతో అధిష్టానం పొత్తులపై స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నారు కేడర్‌.

ఇక తెలంగాణలోనూ సింగిల్‌గా పోటీచేస్తారా? లేక చిన్న పార్టీలను కలుపుకుని మింగిల్‌గా వెళతారా అన్నది కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. కార్యాచరణ కూడా ఇస్తారంటున్నారు. తెలంగాణ నుంచి బండి‌‌ సంజయ్, కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ సహా జాతీయ కార్యవర్గ సభ్యులు నివేదికలతో వెళుతున్నారు. మొత్తానికి ఏపీ, తెలంగాణలో బీజేపీ ఎలాంటి వ్యూహాలతో వెళుతుందన్నది ఆసక్తిగా మారింది. అటు కేడర్‌లో కూడా అక్కఉత్కంఠ రేపుతోంది. మరి అధిష్టానం ఎలాంటి రోడ్‌మ్యాప్‌ ఇస్తుందో చూడాలి.