వైసీపీ (YCP) ప్రభుత్వ తీరుపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే రాజధానిని పూర్తి చేస్తామని చెప్పి, మూడు రోజులను ముందేసుకున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం కేంద్రం రూ.2,500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ ఏం చేశారని చాలామంది అడుగుతున్నారని.. విజయవాడలో (Vijayawada) ఐదు ఫ్లై ఓవర్లు కేంద్రమే కట్టించిందని వివరించారు. అమరావతి – మచిలీపట్నం రహదారితో పాటు, నేషనల్ హైవేలనూ డెవలప్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇవన్నీ కేంద్రం చేస్తున్నవేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కాగా.. వైసీపీ పాలనలో కేంద్రం ఇస్తున్న నిధులు దారి మళ్లుతున్నాయని, రైతులకు అన్యాయం జరగుతోందని చెప్పారు. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులనూ రాష్ట్రం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానిని కలిసి ఉంటే రాజధాని ఎప్పుడో పూర్తయ్యేదని, తద్వారా వైసీపీ 150 సీట్లు గెలిచేది కాదని అభిప్రాయపడ్డారు.
వైసీపీ ప్రభుత్వాన్ని దించి, బీజేపీ కి అధికారం ఇస్తే రెండేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని సోము వీర్రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. గర్వించే స్థాయిలో రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాము ఎవరినీ రక్షించడం లేదని, సరైన సమయంలో అన్నీ జరిగిపోతాయన్నారు. వైసీపీ, టీడీపీలు ఏపీ కి రాజధాని లేకుండా చేశాయని.. అమరావతిలో నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
ఏపీ ఆర్థిక పరిస్థితి కేంద్రం కంటే బాగుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారన్న సోము వీర్రాజు.. అలా అయితే కేంద్రమిచ్చిన బియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. రోజూ అప్పుల కోసం ఎందుకు పరిగెడుతున్నారని నిలదీశారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధాని ఎందుకు కట్టలేకపోతున్నారో సమధానం చెప్పాలని కోరారు. సీఎం జగన్ చెబుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని, పోలవరం ఏటీఎం కాకూడదని సోము వీర్రాజు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..