ఏపీలో మళ్లీ విభజన హామీల చిచ్చు రాజుకుంటోంది. పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతుంటే… ప్రజాసంఘాలు హక్కులకై పోరాటానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అజెండాగా వస్తుంటే.. రాష్ట్రాన్ని చీల్చిన పార్టీకి ఇక్కడ చోటు లేదంటున్నాయి మిగిలిన పార్టీలు. విభజన హామీలు సాధించడంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయని.. మళ్లీ అధికారంలోకి వస్తే ఇస్తామంటోంది హస్తం పార్టీ. అటు మెడలు వంచి తెస్తామన్న పార్టీ ఎందుకు సాధించలేదని వైసీపీని ప్రతిపక్షాలు నిలదీస్తుంటే.. నాడు టీడీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం వల్లే సమస్యగా మారిందన్నారు మంత్రులు.
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. పాత అజెండాలు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి.. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలపై మళ్లీ పార్టీలు చర్చ పెడుతూ రచ్చగా మారుస్తున్నాయి. రాష్ట్రాన్ని విభజించారన్న కారణంగానే ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మరోసారి ఏపీలో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా విభజన హామీలను తెరమీదకు తీసుకొస్తోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన కూడా బీజేపీకి బీ టీమ్‌గా మారి.. విభజన హామీలు పణంగా పెట్టారన్నారు. విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలంటన్నారు ఆ పార్టీ నేతలు…
మరోవైపు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబునాయుడే అంటోంది వైసీపీ. నాడు ముఖ్యమంత్రిగా యూటర్న్ తీసుకోవడం వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి..
మరోవైపు అటు ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, చిన్నపార్టీలు కూడా ప్రత్యేక హోదాపై పోరాడాలని నిర్ణయించాయి. విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి మరీ చర్చించారు. టీడీపీ, వైసీపీ కలిసికట్టుగా ఉండి పోరాటం చేసి ఉంటే హోదా సాకారమయ్యేదన్నారు. చట్టసభలో ఇచ్చిన హామీ కూడా సాధించలేని దుస్థితిలో పార్టీలున్నాయని మండిపడ్డాయి ప్రజాసంఘాలు..
విభజన జరిగి పదేళ్లు కావొస్తుంది. కామన్ కేపిటల్ సహా పలు అంశాలకు కాలపరిమితి కూడా ముగుస్తోంది. ఈ సమయంలో ఎన్నికల వస్తుండడంతో పార్టీలకు ప్రధాన అజెండాగా మారింది. మరి ఎవరికి ప్లస్ అవుతుంది? ఎవరికి మైనస్ అవుతుంది?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..