Andhra: బాబుని ఒంటరిని చేశారు.. ఈ కథనం చదివి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

ఫోన్లది తప్పా.. సోషల్ మీడియా తప్పా.. సినిమాల ప్రభావమా.. లేక ఆకర్షణా... పాపం పాలుగారే ఆ పిల్లోడిని అనాధను చేశారు. ఆమె మాత్రం తనను వశం చేసుకోడానికి ఆ పరాయి వ్యక్తి ఏదో పన్నాగం పన్నాడని.. అందుకే మోసపోయానని చెప్తుంది. అలాంటప్పుడు న్యాయపోరాటం చేయాల్సింది కదా...!

Andhra: బాబుని ఒంటరిని చేశారు.. ఈ కథనం చదివి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..
Bhimadole News

Updated on: Oct 29, 2025 | 9:05 PM

ఆంధ్రాలోని భీమడోలు పట్టణంలో ఓ యువ దంపతుల ఆత్మహత్య ఘటన విషాదం నింపింది. ఆత్మహత్యకు ముందు ఇద్దరూ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఓవైపు ప్రేమ వివాహం, మరోవైపు ఆకర్షణ.. చివరికి ముగింపు విషాదమే అయ్యింది. వివరాల్లోకి వెళ్తే… భీమడోలు పట్టణానికి చెందిన గుండుమోలు సుధాకర్‌, భానుపూర్ణిమ (22) దంపతులు. వీరు ప్రేమించి 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సిమెంట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన కటారి మోహన్ అనే వ్యక్తి పూర్ణిమకు ఓ వేడికలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సన్నిహితంగా మెలిగారు. వారిద్దరి ప్రవర్తనపై సుధాకర్‌కు అనుమానం కలిగింది. ఈ విషయంపై భార్యను ప్రశ్నించాడు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో విభేదాలు తీవ్రం అయ్యాయి.

ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం భానుపూర్ణిమ కనిపించకుండా పోవడంతో సుధాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. విచారణలో మోహన్‌తో పూర్ణిమ వెళ్లిపోయినట్లు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత పూర్ణిమ తిరిగి ఇంటికి వచ్చింది. అయితే ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన దంపతులు, శనివారం రాత్రి సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు, బంధువులకు పంపించారు. ఆ వీడియోలో ఇక బ్రతకడం ఇష్టం లేదు అని చెప్పి, ఇద్దరూ విషం తాగారు. తమ చావుకు కటారి మోహన్ కారణమని భానుపూర్ణిమ వీడియోలో తెలిపింది. అతడు తనను మభ్య పెట్టి తీసుకెళ్లాడని వాపోయింది.

అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. భానుపూర్ణిమ సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. సుధాకర్‌ మంగళవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో వారి మూడేళ్ల కుమారుడు ఒంటరిగా మిగిలిపోయాడు. భానుపూర్ణిమ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మోహన్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉన్నట్టు భీమడోలు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.