Bengal tiger: ఈ మధ్య కాలంలో పులులు జనవాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి. అడవులను వదిలి పరిసర ప్రాంతాలు, పొలాల్లోకి రావడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది. ఇక ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ మర్రి చెట్టు వద్ద బెంగాల్ టైగర్ (పులి) సంచరిస్తోంది. తాజాగా శనివారం రాత్రి వజ్రకూటం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో పైకి పెద్ద పులి దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. పులి పాదముద్రలను సేకరించిన అటవీ శాఖ అధికారులు.. తొందరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు. బెంగాల్ టైగర్ సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఎవ్వరు కూడా బయటకు రాకూడదని అటవీ శాఖ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.