AP News: ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు.. వీడియో వైరల్..

అది తెల్లవారుజాము సమయం.. ఎప్పటిలాగే వాకింగ్ చేసేందుకు జనం గ్రౌండ్‌కు చేరుకున్నారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షమైన ఆ అతిథిని చూసి అందరి గుండెలు ఆగిపోయినంత పనైంది. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఎలుగుబంటి హల్చల్ వీడియో వైరల్‌గా మారింది.

AP News: ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు.. వీడియో వైరల్..
Bear Enters Rayadurgam Junior College

Edited By:

Updated on: Mar 24, 2026 | 7:18 PM

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున కలకలం రేగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి ఎలుగుబంటి ప్రవేశించడంతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ సిబ్బంది గంటల తరబడి శ్రమించి, సినిమా ఫక్కీలో ఆ ఎలుగుబంటిని బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రతిరోజూలాగే మంగళవారం తెల్లవారుజామున రాయదుర్గం జూనియర్ కళాశాల గ్రౌండ్‌కు వాకర్స్ చేరుకున్నారు. చీకటి వెలుగుల్లో మైదానంలో ఏదో జంతువు సంచరిస్తుండటం గమనించిన వాకర్స్, తీరా అది ఎలుగుబంటి అని తెలియడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు. జనాన్ని చూసి కంగారుపడిన ఆ ఎలుగుబంటి, వెంటనే సమీపంలోని కళాశాల బాత్రూంలోకి దూరి లోపల దాక్కుంది.

బాత్రూం వద్ద భారీ బందోబస్తు

ఎలుగుబంటి బాత్రూంలోకి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే కాలేజీకి విద్యార్థులు రావడం ప్రారంభించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఎవరినీ లోపలికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అది ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో చివరకు బాత్రూం ద్వారం వద్ద బలమైన వలలను ఏర్పాటు చేశారు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బంది, చాకచక్యంగా ఎలుగుబంటిని వలల్లో చిక్కేలా చేసి.. ఎట్టకేలకు దానిని బోనులో బంధించారు. ఈ ఆపరేషన్ ముగియడానికి కొన్ని గంటల సమయం పట్టింది.

సురక్షితంగా అడవిలోకి..

బోనులో బంధించిన ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు రాయదుర్గం శివార్లలోని సురక్షిత అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ దానిని అడవిలోకి విడిచిపెట్టడంతో స్థానికులు, కాలేజీ విద్యార్థులు పెద్ద గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు. ఎలుగుబంటి ఎవరికీ ఎటువంటి హాని చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us