
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇప్పటికే వాయుగుండంగా మారిన ఈ వ్యవస్థ.. రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. ఎల్లుండి సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అప్రమత్తమైంది. సముద్రంలో వాతావరణం అనుకూలంగా లేనందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు కూడా తీరానికి చేరుకోవాలని సూచించింది.
ప్రజలు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉండటంతో.. రానున్న రెండు రోజులు కీలకం కానున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.