బ్యాంక్ ఉద్యోగం వదిలి వ్యవసాయం.. రోజుకు రూ.5 వేలు సంపాదన..

బ్యాంక్ ఉద్యోగం వదిలి వ్యవసాయ బాధ్యతలు స్వీకరించిన కడప జిల్లాకు చెందిన రావూరి శేఖర్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది. ఐదు ఎకరాల పొలంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో సాగు చేస్తూ, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. భూసారాన్ని కాపాడుతూ, రసాయనిక రహిత ఆహారాన్ని అందిస్తూ ఇతర రైతులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

బ్యాంక్ ఉద్యోగం వదిలి వ్యవసాయం.. రోజుకు రూ.5 వేలు సంపాదన..
Banker Turned Farmer

Updated on: Sep 12, 2026 | 8:06 AM

ఉద్యోగం అంటే మంచి జీతం, భద్రమైన జీవితం అనే ఆలోచనలకు భిన్నంగా, ప్రకృతితో మమేకమై సొంత భూమిలో పంటలు పండిస్తూ పది మందికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నం రాజుపల్లి గ్రామానికి చెందిన యువ రైతు రావూరి శేఖర్. ఎనిమిదేళ్ల పాటు బ్యాంక్ ఉద్యోగం చేసిన శేఖర్, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయ బాధ్యతలను స్వీకరించారు. ఏడాది క్రితం తండ్రి నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందడంతో, తనకున్న ఐదు ఎకరాల పొలాలు పచ్చదనం కోల్పోకూడదని నిర్ణయించుకున్నారు. తండ్రి బాటలోనే నడవాలని భావించి, పూర్తిస్థాయిలో వ్యవసాయంపై దృష్టి సారించారు. శేఖర్ ఐదు ఎకరాల పొలంలో బహుళ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఒకే పంటపై ఆధారపడకుండా భూమిని సద్వినియోగం చేసుకోవడమే ఆయన లక్ష్యం. రెండు ఎకరాల్లో అవకాడో, మరో ఒకటిన్నర ఎకరాల్లో కొబ్బరి, మహాగని మొక్కల్ని సాగు చేస్తున్నారు. ఈ ప్రధాన పంటలు పూర్తిస్థాయిలో దిగుబడికి రావడానికి సుమారు ఐదేళ్లు పడుతుంది. అంతవరకు పొలాన్ని ఖాళీగా ఉంచకుండా, ప్రధాన పంటల మధ్యలో టమాటా, బెండ, వంకాయ, చిక్కుడు, కీరదోస, మిరప, క్యారెట్, పసుపు, బీట్‌రూట్ వంటి స్వల్పకాలిక పంటల్ని అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. దీనివల్ల ఒక పంట కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా వివిధ పంటల ద్వారా నిరంతర ఆదాయం పొందుతున్నారు. ఈ సాగు పద్ధతి కుటుంబానికి ఆసరాగా నిలవడమే కాకుండా, వ్యవసాయ పనుల్లో మరికొందరికి ఉపాధి కూడా కల్పిస్తోంది.

ప్రారంభంలో రసాయనిక ఎరువులను వాడిన శేఖర్, “మల్టీ మల్టీ గ్రీన్” సహజ వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. రసాయనిక మందుల వాడకం వల్ల ఖర్చులు పెరగడం, దిగుబడిలో నాణ్యత లోపించడం గమనించిన ఆయన, ప్రకృతి వ్యవసాయం ఖర్చులను తగ్గిస్తుందని, ఆదాయాన్ని పెంచుతుందని తెలుసుకున్నారు. జీవామృతం, ఘనామృతం వంటి స్వయం తయారుచేసుకున్న ఎరువులను పంటలకు అందిస్తున్నారు. ఆవు పేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం వంటి వాటితో తయారయ్యే ఈ మిశ్రమాలు తెగుళ్లు, పురుగుల నివారణకు బాగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వీటిని పంటలకు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరగడమే కాకుండా, పంటలు ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉన్నాయని శేఖర్ గారు సంతోషం వ్యక్తం చేశారు. తోట వద్దకే వచ్చి కూరగాయలు కొనే వినియోగదారులు మళ్లీ మళ్లీ అడుగుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు, నిపుణులు రసాయనిక ఎరువుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని సూచించిన నేపథ్యంలో, ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. వ్యవసాయ అధికారుల మట్టి పరీక్షల ఆధారిత సూచనలను పాటిస్తూ శేఖర్ తన పొలంలో కార్బన్, నత్రజని నిష్పత్తిని మెరుగుపరిచారు, ఇది సూక్ష్మజీవ కార్యకలాపాలను అధికం చేసింది. దీనివల్ల సూక్ష్మ పోషకాల లోపాలు, తెగుళ్లు తగ్గాయి. పురుగు మందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే రసాయనిక ఎరువులను ఉపయోగించారు. దీని ఫలితంగా, గత సంవత్సరం కేవలం కూరగాయల సాగు నుంచే రెండున్నర లక్షల నికర లాభాన్ని ఆర్జించగలిగారు.

పక్షి స్థావరాలు, స్టికీ ట్రాప్స్ వంటి పర్యావరణ అనుకూల చీడపీడల నియంత్రణ పద్ధతులను కూడా ఆయన అవలంబిస్తున్నారు. నేటి యువతకు శేఖర్ ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇస్తున్నారు: “ఎక్కడో ఎంతో దూరమో పోయి మనం వాళ్ళ కింద వీళ్ళ కింద పని చేసేదానికంటే మనకు సొంత పొలం ఉంటే రెండెకరాలు గానీ తోట పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే దానికి మించిన ఆనందం లేదు. ఇంటికాడ ఉంటే పెద్దలు వాళ్లకు తోడుగా ఉండి, కష్టపడటం వల్ల మనకు కొంచెం ఉపాధి ఉండేట్టు ఉంటుంది.” బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయాన్ని ఎంచుకున్న ఈ యువ రైతు, ప్రకృతిని నమ్ముకుని ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకుంటే వ్యవసాయం లాభసాటి వృత్తిగా మారుతుందని నిరూపిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us