Asha worker suicide attempt: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. అధికారపార్టీ వైఎస్ఆర్ సీపీ నాయకులు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లాలోని చెర్లోపల్లికి చెందిన ఓ ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. చెర్లోపల్లికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు తనను నిత్యం వేధిస్తున్నారని ఆశా కార్యకర్త వెల్లడించింది. తమతో గడపాలని, తాము చెప్పినట్లు నడుచుకోవాలని.. లేదంటే ఉద్యోగాన్ని తీసేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ.. వాపోయింది. వారి వేధింపులు తట్టుకోలేక మనస్తాపం చెంది వాస్మోల్ నూనె తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు ఆమె పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఈ ఘటనపై రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అధికార వైసీపీ నాయకులపై మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అరాచకం ఎక్కువైందంటూ పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సునీత డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్పందించారు. ఆశా వర్కర్ విషయంలో చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. ఈ సంఘటనలో ఎవరు ఉన్నా తీవ్రంగా చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆశా కార్యకర్త ఆరోగ్యం బాగున్నా.. డిశ్చార్జి కాకుండా ఒత్తిళ్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read: