Andhra Pradesh: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..

ఎండలు మాత్రం అప్పుడే ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఎండతీవ్రత రికార్డు స్థాయికి చేరనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీవ్ర వడగాల్పులు వీచే ఆ మండలాలు ఏవి? ఈ ఎండ దెబ్బ నుంచి వృద్ధులు, పిల్లలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. వచ్చే 48 గంటలు జాగ్రత్త..
Ap Heatwave Alert

Updated on: Apr 02, 2026 | 7:24 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత తీవ్రస్థాయిలో ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. శుక్రవారం మొత్తం 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇక శనివారం ఎండ తీవ్రత కొనసాగుతూ 41 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీయవచ్చు.

జిల్లాల వారీగా ప్రభావిత ప్రాంతాలు:

  • విజయనగరం: 19 మండలాలు
  • శ్రీకాకుళం: 13 మండలాలు
  • పార్వతీపురం మన్యం: 11 మండలాలు
  • అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని పలు మండలాలు కూడా ప్రభావితం కానున్నాయి.

ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

గురువారం నమోదైన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాంలో 40.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మక్కువ, నిండ్ర ప్రాంతాల్లో 40 డిగ్రీలు, ధర్మాజీగూడెం, రేణిగుంట, పోడూరు వంటి ప్రాంతాల్లో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ప్రజలకు ముఖ్య సూచనలు

డీహైడ్రేషన్ : దాహం వేయకపోయినా మంచినీరు ఎక్కువగా తాగాలి. ఓఆర్ఎస్, ఇంట్లో తయారుచేసిన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు తీసుకోవడం ఉత్తమం అని అధికారులు సూచించారు.

వృద్ధులు, పిల్లల జాగ్రత్త: ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి.

దుస్తులు: వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా తలకు రుమాలు కట్టుకోవాలి.

ఆహారం: తేలికపాటి ఆహారం తీసుకోవాలి. కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే ఇవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి.

Follow Us