
అమరావతి, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు కోసం మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఏపీ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు–విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన NSHIP-AP సంస్థతో MDL ఈ ఒప్పందం చేసుకుంది.
రూ.15 వేల కోట్ల పెట్టుబడి.. 45 వేల మందికి ఉపాధి
దుగరాజపట్నం గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ కోసం రానున్న ఐదేళ్లలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని MDL ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. షిప్‌బిల్డింగ్‌తో పాటు మెరైన్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, రిపేర్, సర్వీసెస్, అనుబంధ పరిశ్రమలకు కూడా ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుంది. ప్రతిపాదిత షిప్‌యార్డ్‌కు ఏడాదికి 12 లక్షల గ్రాస్ టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యం ఉండనుంది. ట్యాంకర్లు, బల్క్ క్యారియర్లు, కంటైనర్ నౌకలు, ఎల్‌ఎన్‌జీ క్యారియర్లు, ఇతర భారీ ప్రత్యేక నౌకలను నిర్మించేలా దీనిని అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.
దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్-కమ్-పోర్ట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం షిప్‌బిల్డింగ్, షిప్ రిపేర్ యార్డ్‌కు సుమారు రూ.29,254 కోట్లు, పోర్టు అభివృద్ధికి సుమారు రూ.9,513 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ క్లస్టర్‌కు MDLను యాంకర్ షిప్‌యార్డ్‌గా ఎంపిక చేశారు.
రూ.22,177 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 21వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో 28 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. మొత్తం రూ.22,177.84 కోట్ల పెట్టుబడులు, సుమారు 19,739 ఉద్యోగాల కల్పనకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంధనం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటకం, క్వాంటమ్ టెక్నాలజీ, షిప్‌బిల్డింగ్ తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ రూ.8,000 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టును చేపట్టనుంది. దీనివల్ల 3,000 ప్రత్యక్ష, 5,000 పరోక్ష ఉద్యోగాలు కలగనున్నాయి. మై హోమ్ ఇండస్ట్రీస్ పల్నాడులో రూ.3,000 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది.
హార్డ్‌వేర్ తయారీ హబ్ ఏర్పాటు!
అమరావతిలో క్వాంటమ్ హార్డ్‌వేర్, క్వాంటమ్ ఏఐ, బయోటెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో పలు సంస్థలకు కూడా ఆమోదం లభించింది. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ తయారీ హబ్‌లను అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు.
పోర్టులు–లాజిస్టిక్స్–పరిశ్రమలకు అనుసంధానం
రాష్ట్రంలోని పోర్టులను కేవలం కార్గో రవాణా కేంద్రాలుగా కాకుండా లాజిస్టిక్స్, షిప్‌బిల్డింగ్, గోదాములు, తయారీ, అనుబంధ పరిశ్రమల సమగ్ర ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చేయాలని చంద్రబాబు సూచించారు. పోర్టులు, రైల్వేలు, రోడ్లు, ఎయిర్ కార్గో, అంతర్గత జల రవాణాను అనుసంధానం చేసి ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి తైవాన్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేందుకు 10వ తరగతి నుంచే స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.
రేర్ ఎర్త్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీపై ఫోకస్
రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత పరిశ్రమలు, పరిశోధన, తయారీ రంగాలను అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్ర లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించారు.
ఇప్పటివరకు జరిగిన 21 SIPB సమావేశాల్లో కలిపి 387 ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా సుమారు రూ.14.05 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.79 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని వెల్లడించింది. తాజాగా దుగరాజపట్నం షిప్‌యార్డ్‌తో పాటు భారీ పెట్టుబడులకు ఆమోదం లభించడంతో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పోర్ట్ ఆధారిత ఎకానమీపై ప్రభుత్వం మరింత దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..