తెలుగు దేశం పార్టీకీ షాకిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో నిలుపుదల

|

Feb 04, 2021 | 9:09 PM

టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు దేశం పార్టీకీ షాకిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో నిలుపుదల
Follow us on

AP SEC on TDP panchayat election manifesto : ఎట్టకేలకు తెలుగుదేశంపార్టీ మేనిఫెస్టోపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై అధికార వైఎస్సార్‌సీపీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేనిఫెస్టో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందని.. తక్షణమే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డితో పాటూ నేతలు.. లీగల్‌ సెల్‌ ప్రతినిధులు ఎన్నికల సంఘం జాయింట్‌ సెక్రటరీ రామారావును కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు చేపట్టారు. మేనిఫెస్టో విడుదల చేయడంపై టీడీపీ వివరణ సంతృప్తికరంగా లేదన్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఆ మేనిఫెస్టోను నిలుపుదల చేస్తున్నట్టు ఎస్‌ఈసీ ప్రకటించారు. టీడీపీ విడుదల చేసిన ‘పల్లె ప్రగతి–పంచసూత్రాలు’ పేరుతో ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టోను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోలో ఓటర్లను ప్రభావితం చేసేలా పలు పథకాలు, హామీలు పొందుపర్చారని వచ్చిన ఫిర్యాదుతో చర్చలు తీసుకున్నట్లు తెలిపారు.

ఇదిలావుంటే, పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని స్పష్టం చేశారు. టీడీపీ మేనిఫెస్టోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. కాగా, టీడీపీ దీనికి విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని గతంలో వైసీపీ నేతలు ఆరోపించారు.

Read Also…  ఎంపీ, ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసుల విషయంలో తాము జోక్యం చేసుకోలేం.. స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు