ఆ జిల్లాలో ఆయనకు పెద్దాయనగా పేరుంది. జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకత్వం ఆయనది. అంతే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆయనకో గుర్తింపు ఉంది. అయితే 2024 ఎన్నికల తర్వాత అంతా సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన సైలెన్స్ కేడర్‌లో నిస్తేజాన్ని మిగిల్చింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో ఆయన రూలర్. అంతే కాదు స్టేట్ పాలిటిక్స్ లోనూ ఆయనది కీ రోల్. ఇక రాయలసీమ లో అయితే ఆయనే పవర్ ఫుల్. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాజకీయం, అధికారం రెండూ ఆయన చుట్టే తిరగ్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు మాజీ సీఎంలతో ఆయన రాజకీయ శత్రుత్వం నడిచింది. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను పొలిటికల్‌గా టార్గెట్ చేసి పాలిటిక్స్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నట్లుగా కేడర్ భావిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగినా పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ముగ్గురూ వైసీపీ జెండాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎగుర వేసారు.
అయితే పెద్దిరెడ్డి ఫ్యామిలీ కి రాష్ట్రంలో అధికార మార్పు ఇబ్బందులకు కారణం అయ్యింది. పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచినా ముగ్గురూ మూడు నెలలు పాటు సొంత నియోజక వర్గాల్లో అడుగు పెట్టడానికి వీల్లేని పరిస్థితి వారికి ఎదురైంది. ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి, ఎంపీగా మిథున్ పుంగనూరులో పర్యటించడం కష్టంగా మారిపోగా దాడులు, కేసులు, అరెస్టులు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే నియోజక వర్గంలోకి అడుగు పెడుతున్నా కేడర్‌లో మాత్రం నిస్తేజం నెలకొంది. కూటమి ప్రభుత్వం దూకుడుతో ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు, పెద్దిరెడ్డి అనుచరులు కొందరు పార్టీకి దూరం కాగా ఇతర పార్టీల్లోకి మరికొందరు వెళ్లడంతో పుంగనూరు పొలిటికల్ ఈక్వేషన్స్ మారి పోయాయి. వైసీపీకి తిరుగు లేని చోట గత 6 నెలలుగా అధికార పార్టీ దూకుడుతో పరిస్థితి తారుమారు అయ్యింది.
మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ పుంగనూరు ను అంటిపెట్టుకొని ఉంటూ వచ్చిన పెద్దిరెడ్డి దాదాపు ఆరు నెలలపాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పుంగునూరులో అడపాదడపా పర్యటిస్తున్నా కేడర్ లో మాత్రం ఇంకా నిస్తేజం వీడని పరిస్థితికి కారణం అయ్యింది, కేసులు, దాడులకు భయపడుతున్న వైసీపీ కేడర్ కు భరోసా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అధికారం దూరం అయ్యాక ఇబ్బంది పడ్డ పార్టీ నేతలకు అన్ని విధాలా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అండగా ఉన్నా కేడర్ మాత్రం ధైర్యంగా ముందుకు రాలేక పోతోంది. పుంగనూరు నియోజక వర్గంలో దాదాపు ప్రజా ప్రతినిధులంతా వైసీపీ చెందిన వారైనా వారంతా పెద్దిరెడ్డి అనుచరులు కావడంతో కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు, పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేని పరిస్థితి ఉంది. కొందరు వైసీపీ నేతలు ఇప్పటికే పుంగనూరుకు దూరంగా అజ్ఞాతంలో ఉండటంతో కేడర్‌కు స్థానిక నాయకత్వం కరువైంది. ఇలా పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండడం, కేడర్‌కు భరోసా ఇచ్చే నాయకత్వం లేకపోవడంతో పుంగనూరు రాజకీయం కాస్తా చల్లబడిందన్న చర్చ నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి