Gannavaram Political Heat: గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. ఓరిజినల్ వైసీపీ వర్సెస్ నయా వైసీపీ మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఈ పంచాయితీ వైసీపీ(YCP) ఆగ్రనేత విజయసాయి రెడ్డి(Vijay Saireddy) దాకా వచ్చింది. దీంతో గన్నవరం టాక్ ఆఫ్ దీ ఏపీగా మారింది. ఏపీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కృష్ణా జిల్లా. ఆ జిల్లాలో గన్నవరం నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇప్పుడు అక్కడ రాజకీయం మాంచి కాక మీద ఉంది. ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే ఎమ్మెల్యే టికెట్ కోసం పైరవీలు మొదలయ్యాయి. అటు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మళ్లీ యార్లగడ్డకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు కార్యకర్తలు. టీడీపీ తరఫున గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ, సీఎం జగన్‌కు బాగా దగ్గరయ్యారు. అప్పటినుంచి గన్నవరంలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. దీంతో దుట్టా రామచంద్రారావు వర్సెస్ వల్లభనేని వంశీ వయా యార్లగడ్డ వెంకట్రావ్ అన్నట్టుగా మారింది రాజకీయం.
తాజాగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయసాయిరెడ్డికి ఫిర్యాడు చేశారు కొందమంది నాయకులు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు విజయసాయి వద్ద వాపోయారు. గతంలో వైసీపీ ఓటమి కోసం పనిచేసి టీడీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ, తమను ఇబ్బందిపెడుతున్నారని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ వంశీకి ఇవ్వొద్దని, యార్లగడ్డ వెంకట్రావ్‌కే ఇవ్వాలని విజయసాయిని కోరారు నేతలు.
కార్యకర్తలను కలుపుకుపోతానని వైసీపీలోకి వచ్చిన వంశీ, తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అయితే, ఇది చాలా సున్నితమైన అంశం అని, కొన్నాళ్లలో సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చారు విజయసాయిరెడ్డి. ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి, అన్ని సర్దుకునేలా చేస్తానని చెప్పారు. గతంలోనూ దుట్టా వర్గం, వల్లభనేని వర్గాలు బాహాబాహికి దిగిన సందర్భాలున్నాయి. ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే కుర్చీలతో కొట్టుకున్నారు. ఇటీవల పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లింది వీరి వర్గపోరు. యార్లగడ్డ వెంకట్రావ్ స్వయంగా స్టేషన్‌కు వెళ్లి, తన అనుచరులను విడిపించాల్సి వచ్చింది. వంశీ వచ్చినప్పటి నుంచి అనేక వివాదాలు జరగడం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జరుగుతోంది.
Read Also…