
కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు యాత్రికులు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే పార్వతీపురం పట్టణం పండవీధికి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ ఫ్యామిలీ గల్లంతైంది. పార్వతీపురం జిల్లాకు చెందిన సంతోష్, స్పందన అనే దంపతులు తమ పిల్లలు సైనాకుమారి సాహు, సురభి మన్మధలతో కలిసి లండన్ లో నివాసముంటున్నారు. అయితే ఇటీవల వారు లండన్ నుంచి నేరుగా కుటుంబమంతా కలిసి మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్‌కు వెళ్లారు. అయితే నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలతో రహదారులు, వంతెనలు, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో యాత్రికులతో సంబంధాలు తెగిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల వివరాలను సేకరిస్తూ కేంద్ర ప్రభుత్వం, భారత దౌత్య వర్గాలు, నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన 34 మంది యాత్రికులను గుర్తించి సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించగా మరో ఏడుగురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పార్వతీపురానికి చెందిన నలుగురి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి వీరి జాడను త్వరగా గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఎన్నారై వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఈ ఘటన పై బాధితుల ఆచూకీ కోసం అధికారులను అప్రమత్తం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.