AP Municipal Elections 2021 Results : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ బోణీ కొట్టింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీలను ఆపార్టీ కైవసం చేసుకుంది. ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీ హవా కనిపిస్తోంది. గిద్దలూరులో 20 వార్డులకు గానూ 9 వార్డులు వైసీపీ కైవసం చేసుకోగా.. కనిగిరిలో 20 వార్డుల్లో వైసీపీ 10 స్థానాలు గెలుచుకుంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటు సాధారణ ఓట్ల లెక్కింపు పూర్తవడంతో అధికారులు ఫలితం ప్రకటించారు. 121 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచారు.
ఫలితాలు అనుకూలంగా రిజల్ట్ రావడంతో అధికార వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే రకమైన ఫలితాలు తధ్యమంటున్నారు. అటు, అమరావతి తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు షురూ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ సెంట్రల్ ఆఫీసుకు చేరుకోవడంతో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. అటు, రాష్ట్ర వ్యాప్తంగానూ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ముందంజలో కొనసాగుతోంది.
పోస్టల్ బ్యాలెట్లలో అధికార పార్టీ అభ్యర్థులకే మెజారిటీ వచ్చింది. కాగా, ఎన్నికలకు ముందే చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ తన విజయాన్ని ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీకి 4 మున్సిపాలిటీలు ఏకగ్రీవం చేసుకోగా.. పలుచోట్ల ఏకగ్రీవాలతోనే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మరికొన్నిచోట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు దక్కించుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంది అధికారపార్టీ.