AP Minister Goutham Reddy Passes Away: ఆరడుగుల ఆజానుబాహుడు, కండలు తిరిగిన దేహం, బాడీ బిల్డర్‌ను తలపించే స్ట్రక్చర్, ఫుల్ అండ్ ఫిట్‌నెస్, నో హెల్త్ ఇష్యూస్, ఇదీ మంత్రి గౌతమ్‌రెడ్డి టోటల్ హెల్త్ ప్రొఫైల్. గౌతమ్‌రెడ్డి ఫిట్‌నెస్‌ను చూస్తే ఆయన ఫుల్ హెల్దీగా కనిపిస్తారు. అలాంటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మరణించారంటే ఎవ్వరూ నమ్మకపోతున్నారు. అసలు, గౌతమ్‌రెడ్డి మరణించడానికి కారణమేంటి? కేవలం గుండెపోటుతోనే మరణించారా? అసలు, నిన్న రాత్రి ఏం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల అందరిలో మెదులుతున్న ప్రశ్నలు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం ఉదయం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు హుటా హుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు అత్యవసరంగా ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.. అక్కడ చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. మంత్రి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. రావడం రావడమే నిన్న రాత్రి నెల్లూరులో ఒక నిశ్చితార్థం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌లోని ఇంటికెళ్లిపోయారు. తెల్లవారేసరికి, గౌతమ్‌రెడ్డికి సడన్ స్ట్రోక్. ఆస్పత్రికి తరలించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దుబాయ్ టూర్‌తో అలసిపోయిన గౌతమ్‌రెడ్డి, నెల్లూరుకి వచ్చిన వెంటనే మరో ప్రోగ్రామ్‌లో పాల్గొనడమే ఆయన కొంప ముంచిందా? లేక, మరేదైనా కారణమా? పోస్ట్ కోవిడ్ లక్షణాలేమైనా ఆయన ఊపిరి తీసేశాయా? గౌతమ్ రెడ్డి ఎంతో ఆరోగ్యంగా ఉంటారనీ. కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారనీ. హోటల్లో కూడా జిమ్ ఫెసిలిటీ చూసుకుంటారనీ చెబుతుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వారు. జిల్లాలో ఎక్కడా ఎవరితోనూ వివాదాల్లేకుండా ఉంటారనీ. ఆయనెంతో మృధుస్వభావిగా చెబుతున్నారు ఆయన బంధు మిత్రులు.
గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం వెనక పోస్ట్ కోవిడ్ లక్షణాలు కూడా ఉండొచ్చంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ. పోస్ట్ కోవిడ్ తర్వాత హార్ట్ ఎటాక్స్, కార్డియాక్ అరెస్టులు పోయాయంటున్నారు. గౌతమ్ డెత్‌కు కూడా పోస్ట్ కోవిడ్ లక్షణాలే కారణం కావొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు ముఖర్జీ.