Minister Anil Kumar: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జలప్రళయంతో రాజకీయాలు వద్దన్నారు ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ వ్యాఖ్యలు పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడినవని అన్నారు. ప్రాజెక్టు గేట్ల కెపాసిటీకి మించి హఠాత్తుగా వచ్చిన వరదతోనే అన్నమయ్య ప్రాజెక్టు వద్ద అనూహ్యంగా వరద కట్టలు తెంచుకుందని తెలిపారు. ఇటువంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయం అందరికీ తెల్సిందే. అందులో 150 మంది జల సమాధి అయ్యారన్నది కూడా అందరికీ తెల్సిందే. అయితే, అక్కడ అధికారంలో ఉంది బీజేపీ కనుక నిజాలను దాచే ప్రయత్నం చేసారంటూ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అన్నమయ్య ప్రాజెక్టులో ఐదో గేటు తెరుచుకున్నా, అందులో నుంచి బయటకు వెళ్ళగల నీటి సామర్థ్యం 40 వేల క్యూసెక్కులు అయితే.. విరుచుకుపడిన వరద 3 లక్షల క్యూసెక్కులకు పైనే. కాబట్టి, ఒక గేటు తెరుచుకోలేదన్న వాదనకు విలువ లేదని అన్నారు. ఈ అంశం స్పష్టంగా తెలిసినా, షెకావత్ ఈ విషయంలో నిజాలు విస్మరించారంటూ చెప్పారు అనిల్. ఈ మొత్తం కట్టుకథను షెకావత్ వెనక కూర్చున్న సీఎం రమేష్, సుజనా చౌదరి బహుశా కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ తరఫున వినిపించి ఉంటారని భావించాలని చెప్పారు. ఏం జరిగిందన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ నుంచి గానీ, ప్రాజెక్టు అధికారులతో గానీ, కేంద్ర ప్రభుత్వం సంప్రదించకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా, ఇటువంటి ప్రకటనలు చేయడం, నిరాధారమైన, అత్యంత సున్నితమైన అంశాలను సాక్షాత్తూ పార్లమెంటులో మాట్లాడటం, ఎంతవరకు సమంజసమన్నది వారు కూడా ఆలోచించాలని చెప్పారు మంత్రి అనిల్ కుమార్. నిరాధారమైన ఈ వ్యాఖ్యలను పట్టుకుని టీడీపీ చేస్తున్న యాగీ చూస్తే, జల ప్రళయంలో కూడా ఇంత దిగజారిన రాజకీయం చేయవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని మంత్రి అనిల్ సూచించారు.
Also Read: జోవాద్ అలెర్ట్.. ఉత్తరాంధ్రలో వర్షాలు.. ఎగసిపడుతున్న సముద్రం..ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు