
AP Local Body Elections Live : ఏపీ పంచాయతీ సమరం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇన్నాళ్లు కోర్టుల్లో వాదనలు జరిగితే… ఇప్పుడు ఎస్ఈసీకి, ప్రభుత్వానికి మధ్య మాటకు మాట నడుస్తోంది. ఏకగ్రీవాలు, మంత్రుల కామెంట్లపై గరంగరం అవుతున్నారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. ఆయనో కీలుబొమ్మ అంటూ తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఆన్‌లైన్‌లో నామినేషన్లు ఇప్పుడు కాకరేపుతున్నాయి. బలవంతపు ఏకగ్రీవాలకు తావులేకుండా నామినేషన్లను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
పంచాయతి ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారుల బదిలీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌ను బదిలీ చేయమని ఆదేవించలేదని నిమ్మగడ్డ చెప్పిన నేపథ్యంలో .. ఆయన జారీ చేసిన ఆదేశాల ప్రతులను సర్కార్ సాక్ష్యంగా చూపిస్తోంది. ఎస్ఈసీ పోస్టు అడ్డం పెట్టుకుని నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఆయనను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని మంత్రి పెద్దారెడ్డి ఆరోపించారు.
ఏకగ్రీవాలు సహజమే అయినా… ప్రలోభ పెట్టి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయాలని చూస్తున్నారని, వివిధ ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా గవర్నర్‌కు వివరించామని నాదెండ్ల చెప్పారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సాయం ఇవ్వలేదు. ఆలయాల పై జరుగుతున్న దాడులను కూడా వివరించామని అన్నారు. వాలంటీర్ ల ద్వారా అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్ కు అధికార యంత్రాంగం సహకరించాలి. అన్ని వ్యవస్థ లు కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలే చూడాలని గవర్నర్‌ను కోరినట్లు నాదేండ్ల మనోహర్ తెలిపారు.
ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో బిజెపి, జనసేన నేతలు భేటీ అయ్యారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ తదితర నేతలు గవర్నర్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు వివరించామని జనసేన నేత నాందెండ్ల మనోహర్ అన్నారు. గతంలో నామినేషన్ లు కూడా వేయకుండా అధికార పార్టీ అడ్డుకున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. ఈసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని గవర్నర్ ని కోరామన్నారు.
ఇదంతా ప్రభుత్వం అసమర్థతని విమర్శించారు. గ్రామాల్లో ప్రార్థనాలయాలన్నింటినీ కాపాడే బాధ్యతను తమ సర్పంచ్‌లు తీసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారన్నారు. భూ కబ్జాలను, రౌడీలను నియంత్రిస్తామని, పారిశుధ్యాన్ని మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. తమ సర్పంచ్‌లను గెలిపిస్తే స్వయం సమ్రుద్ధిని సాధించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అవినీతి జరగకుండా.. వనరులను ఉపయోగించుకుంటూ అందరినీ సమన్యాయం చేయడమే తమే ధ్యేయమరని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ పోరు రసవత్తవరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎందుకు ఓటెయ్యాలి అంటూ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పంచాయతీల పరిరక్షణకు టీడీపీ కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. 20నెలలుగా 125 దాడులు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు.
బీజేపీ, జనసేన నేతలు గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలుసుకున్నారు. ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగేలా చూడాలని గవర్నర్‌ను కోరారు. ఇప్పటికే బీజేపీ తరఫున సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జీ.. గవర్నర్ ను కలిసినవారిలో ఉన్నారు.వీరితోపాటు జనసేన తరఫున నాదేండ్ల మనోహర్, శ్రీనివాస్ యాదవ్ కలిశారు.
పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పునరుద్ఘాటించారు. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అంకితభావంతో నిర్వహించాలన్నారు.
ఎన్నిల కమిషన్‌ను, కమిషనరును వ్యక్తిగతంగా ఎవరూ నిందించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. బుధవారం సాయంత్రం ఒక మంత్రి తనపై విమర్శలు చేయడం బాధాకరం, అనుచితమని రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు తాత్కాలిక ఆవేశంతో తనపై పరుషమైన వ్యాఖ్యలు చేశారని.. వాటిని పెట్టుకోనని స్పష్టం చేశారు.
ఏపీ బీజేపీ, జనసేన నేతలు రాజభవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్‌తో నేతలు భేటీ కానున్నారు. బీజేపీ తరపున సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, దుర్గేష్ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించాలని, ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని గవర్నర్‌కు నేతలు విజ్ఞప్తి చేయనున్నారు.
ఏకగ్రీవం అయిన పంచాయతీలకు నజరానా ప్రకటించింది ప్రభుత్వం. పేపర్లలో ప్రకటనలు ఇవ్వడాన్ని తప్పుబట్టింది SEC. ఎన్నికల సంఘం దృష్టికి రాకుండా ప్రకటనలు ఎలా ఇస్తారంటూ I అండ్ PR కమిషనర్‌కు నోటీసు ఇచ్చారు నిమ్మగడ్డ. ప్రభుత్వం మాత్రం గ్రామాల్లో గొడవలు, ఘర్షణలకు తావు లేకుండా వీలైనన్ని ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని చూస్తోంది. దాన్ని తప్పుబడుతున్నాయి ప్రతిపక్షాలు.