
ఏపీలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లకు అప్పగించిన ప్రభుత్వం… ఇప్పుడు స్కూల్, కాలేజ్ బస్సుల విషయంలో మాత్రం మళ్లీ మాన్యువల్ తనిఖీలకే ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లాల వారీగా రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థల బస్సులను స్వయంగా చెక్ చేస్తూ ఫిట్‌నెస్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఉన్నాయా.. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ పనిచేస్తుందా..
సీట్ల పరిస్థితి ఎలా ఉంది.. విండోలు, డోర్లు సరిగా ఉన్నాయా..ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా.. అంటూ ఒక్కో బస్సును అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
అయితే ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. ప్రభుత్వం చెప్పింది ఏమిటి..
ATS సెంటర్లలో కంప్యూటరైజ్డ్ టెస్టింగ్ ద్వారా వాహనాల బ్రేకులు, సస్పెన్షన్, కాలుష్యం, హెడ్‌లైట్లు సహా అన్ని అంశాలు పారదర్శకంగా పరీక్షిస్తామని ప్రకటించింది. మానవ జోక్యం తగ్గి అవినీతి ఆగుతుందని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు పిల్లలను తీసుకెళ్లే స్కూల్ బస్సుల విషయంలో మాత్రం మళ్లీ అధికారులు స్వయంగా తనిఖీలు చేయాల్సి వస్తోంది.
అంటే ATS టెస్టింగ్ సరిపోవడం లేదా..? లేక పిల్లల భద్రత విషయంలో ప్రభుత్వం ATS పై పూర్తి నమ్మకం పెట్టుకోలేకపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రవాణా శాఖ అధికారులు మాత్రం ఇది అదనపు భద్రత చర్య మాత్రమే అంటున్నారు స్కూల్ బస్సుల్లో సాంకేతిక అంశాలతో పాటు భద్రతా ప్రమాణాలు, ఎమర్జెన్సీ ఏర్పాట్లు కూడా ముఖ్యమని చెబుతున్నారు..
అయితే విమర్శకులు మాత్రం మరో కోణం..ATS ద్వారా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ జరిగితే… మళ్లీ ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం ఎందుకు.. ప్రభుత్వం రెండు విధానాలు అమలు చేస్తున్నట్టే కాదా అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల ప్రాణాల విషయంలో జాగ్రత్త అవసరం అనేది నిజమే. కానీ అదే సమయంలో ATS వ్యవస్థపై ప్రభుత్వం చెప్పిన మాటలకు, ఇప్పుడు జరుగుతున్న తనిఖీలకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..