Andhra: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రిటైర్ అయినా వాళ్లకు మళ్లీ ఉద్యోగం

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.45ను జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా వర్తించనుంది.

Andhra: ఆ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రిటైర్ అయినా వాళ్లకు మళ్లీ ఉద్యోగం
Andhra Government

Edited By:

Updated on: Jul 02, 2026 | 5:05 PM

 

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రతిపాదన మేరకు ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.45ను జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా (రిట్రోస్పెక్టివ్‌గా) వర్తింపజేస్తారు. దీంతో 2022 జనవరి 1 తర్వాత 60 ఏళ్లు పూర్తి చేసి పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను అవసరమైన చోట్ల తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం కల్పించారు.

ఇప్పటికే కోర్టు ఉత్తర్వుల ఆధారంగా 62 ఏళ్ల వరకు విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఆ కాలాన్ని పూర్తిస్థాయి సర్వీసుగా పరిగణించి, అన్ని సర్వీస్ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు తమ సర్వీస్ నిబంధనల్లో అవసరమైన సవరణలు చేసి ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది.

అయితే ఉద్యోగి రిటైర్ అయిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరిన తేదీ వరకు ఉన్న కాలాన్ని ‘అవుట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్’గా పరిగణిస్తారు. ఆ కాలానికి ఎలాంటి వేతనం చెల్లించరు. అయితే వార్షిక ఇంక్రిమెంట్లు నోషనల్ ప్రాతిపదికన వర్తిస్తాయి. వాటి ఆర్థిక ప్రయోజనం మాత్రం తిరిగి ఉద్యోగంలో చేరిన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. అదేవిధంగా సీనియారిటీ, పదోన్నతులు వంటి అంశాల కోసం ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం కల్పించారు.

ఇప్పటికే పెన్షన్, కమ్యూటెడ్ వాల్యూ, గ్రాట్యుటీ, సంపాదిత సెలవుల నగదు వంటి పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలనుకుంటే, నిబంధనల ప్రకారం ఆ మొత్తాలను సంబంధిత సంస్థలకు తిరిగి జమ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి లేని ఉద్యోగులు 60 ఏళ్ల వయసులోనే పదవీ విరమణ పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా గతంలో వివిధ శాఖలు జారీ చేసిన ఆదేశాలు ఇకపై చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us