Vizag: రుషికొండ భవనాలను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?

విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. హాస్పిటాలిటీ రంగానికి అనుసంధానిస్తూ ప్రీమియం టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసి, ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టాటా, లీలా వంటి ప్రముఖ గ్రూప్‌లతో చర్చలు జరిపే అవకాశాన్ని పరిశీలిస్తోంది.

Vizag: రుషికొండ భవనాలను ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా?
Rushikonda Palace

Edited By:

Updated on: Dec 24, 2025 | 10:15 PM

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా రుషికొండ భవనాలను ప్రీమియం టూరిజం ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో హాస్పిటాలిటీ రంగంలో పేరున్న టాటా గ్రూప్, లీలా గ్రూప్‌తో పాటు అట్మాస్ఫియర్ కోర్, ఫెమా గ్రూప్‌లతో చర్చలు జరిపే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మూడో సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో రుషికొండను అంతర్జాతీయ స్థాయి టూరిజం గమ్యంగా తీర్చిదిద్దే అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

హాస్పిటాలిటీ వైపే మొగ్గు

ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. వర్చువల్‌గా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు. పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, ఇతర అధికారులు కమిటీకి వివరాలు అందించారు. రుషికొండ ప్యాలెస్‌ను హాస్పిటాలిటీ రంగానికి అనుసంధానిస్తే ప్రజలకు సందర్శన అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని సబ్ కమిటీ అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం ఉన్న భవనాలు హోటళ్లకు పూర్తిగా అనుకూలంగా లేవని, అవసరమైతే అదనపు నిర్మాణాలపై కూడా ఆలోచన చేయాల్సి ఉంటుందని చర్చకు వచ్చింది.

ఇక మిగిలింది 2 ఎకరాలే

సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల్లో 7 ఎకరాల్లో నిర్మాణాలు చేయకూడదని, మిగిలిన 2 ఎకరాలను ఎలా వినియోగించాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కొందరు సంస్థలు అదనపు భూమి కోరినప్పటికీ, నిబంధనలకు లోబడి మాత్రమే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్యాలెస్‌లోని చివరి రెండు బ్లాక్‌లను ఆర్ట్ గ్యాలరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా అవసరాల కోసం వినియోగించే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. బీచ్ ఫ్రంట్ అభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను అనుసరించాలన్న సూచనలు వచ్చాయి.

28న మళ్ళీ GoM మీటింగ్

రుషికొండ భవనాల వినియోగంపై వచ్చిన ప్రతిపాదనలను ఈ నెల 28న జరిగే GoM సమావేశంలో మరోసారి సమీక్షించనున్నారు. ఆ భేటీలో తుది రూపు దిద్దుకున్న ప్రతిపాదనలను 29 న జరిగే రాష్ట్ర కేబినెట్ ఆమోదానికి పంపనున్నట్లు మంత్రులు తెలిపారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో వయబుల్ మోడల్‌తో ముందుకు వెళ్లాలన్నది సబ్ కమిటీ స్పష్టమైన అభిప్రాయం.

రుషికొండ భవనాలు వైట్ ఎలిఫెంట్‌లా మారాయి… మంత్రులు

మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రుషికొండ ప్యాలెస్ ‘వైట్ ఎలిఫెంట్’గా మారిందని విమర్శించారు. పర్యాటక శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే రిసార్ట్స్‌ను కూల్చి ప్యాలెస్ నిర్మించడం వల్ల ఆదాయం కోల్పోయామని, ప్రస్తుతం నెలకు సుమారు రూ.25 లక్షల నిర్వహణ భారం పడుతోందని తెలిపారు. పర్యాటక శాఖ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రుషికొండ ప్యాలెస్‌ను వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే సబ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న భూమిలోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం నిర్మాణానికి అనుకూలమైన విస్తీర్ణాన్ని హాస్పిటాలిటీ అవసరాలకు ఉపయోగించే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు మంత్రులు.