
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఏపీ ఎంసెట్ పరీక్ష 2023 ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విజయవాడలో ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో చల్ల ఉమేష్ వరుణ్‌కు 158 మార్క్స్‌తో మొదటి ర్యాంక్.. బూరుగుపల్లి సత్య రాజా జస్వంత్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 153 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించాడు. ఏపీ EAPCETకి మొత్తం 3,38,739 మంది విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు నమోదు చేసుకున్న సంఖ్య 2,38,180 కాగా.. అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో రిజిస్టర్ చేసుకున్నవారు 1,00,559 మంది విద్యార్ధులు.
మొత్తం 2,24,724 మంది ఇంజనీరింగ్‌లో పరీక్షకు హాజరు కాగా.. 1,71,514 మంది విద్యార్ధులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 90,573 మంది పరీక్షకు హాజరు కాగా 81,203 మంది విద్యార్దులు క్వాలిఫై అయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు టీవీ9 వెబ్‌సైట్ నుంచి కూడా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా, మే 15-19 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష, మే 22, 23లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2.24 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 90,573 మంది పరీక్షకు హాజరైన సంగతి విదితమే.