
విజయవాడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించారు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు. బస్టాండ్‌లో ప్రమాదస్థలిని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ, ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని.. ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. 24 గంటల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్టీసీ తరఫున రూ.5లక్షల పరిహారం అందజేస్తామని తెలియజేశారు. ఇక ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి ఖర్చులు ఆర్టీసీనే భరిస్తుందన్నారు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు.
ఈ రోజు ఉదయం విజయవాడ బస్టాండ్‌లో విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సిన బస్సు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.. బస్సు కిందపడి మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్ 12 మీదకు బస్సు దూసుకురావడంతో.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక.. భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. అయితే ఈ ప్రమాదానికి కారణం ముందుగా బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యిందని భావించినా, ఆ తర్వాత డ్రైవర్ రివర్స్ గేర్‌కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ ప్రమాదంతో 11, 12 ప్లాట్‌ఫాంల వద్ద దిమ్మెలు విరిగి ఫెన్సింగ్, కుర్చీలు డ్యామేజ్ అయ్యాయి.
ఈ ప్రమాదంలో చీరాలకు చెందిన మహిళ, రెండేళ్ల చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన బుకింగ్ క్లర్క్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ప్రమాద ఘటనతో చుట్టు పక్కల నిలబడి ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బస్సు కింద నలిగిపోతున్న ప్రయాణికుల్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా విజయవాడ బస్ స్టాండ్‌లో జరిగిన ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఘటనపై త్వరితిగతిన విచారణ చేయాలని.. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..