CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో

కుప్పం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆగింది. భార్య భువనేశ్వరితో కలిసి కారు దిగి తాటి ముంజలు అమ్ముతున్న ఓ వ్యాపారి వద్దకు వెళ్లిన చంద్రబాబు.. ముంజలు రుచి చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీఎం దంపతుల సరళత, సామాన్య ప్రజలతో మమేకమైన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

CM Chandrababu: అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఇదిగో వీడియో
AP CM Chandrababu Naidu and Nara Bhuvaneshwari

Edited By:

Updated on: May 20, 2026 | 5:49 PM

ఎటు చూసినా కాన్వాయ్ సైరన్లు, చుట్టూ NSG, SSG భద్రతా సిబ్బంది హడావుడి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన అంటే సాధారణంగా కనిపించే దృశ్యం.. కానీ, తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా ఆయన కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఆగింది. ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, భార్య భువనేశ్వరితో కలిసి ఆయన చేసిన ఒక సాదాసీదా పని ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. కుప్పం పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు దంపతులు తాము ప్రయాణిస్తున్న మార్గంలో రోడ్డు పక్కన తాటి ముంజలు అమ్ముతున్న ఒక సామాన్య వ్యాపారి వారి కంట పడ్డాడు. కండువా కప్పుకుని, చెమటలు చిందిస్తూ ముంజలు కొడుతున్న ఆ వృద్ధుడిని చూడగానే సీఎం మనసు చలించింది. అంతే.. వెంటనే కాన్వాయ్‌ను ఆపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రి కారు దిగి తన వైపు వస్తుండటం చూసి ఆ వ్యాపారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి నేరుగా ఆ బండి వద్దకు వెళ్లారు. బాగున్నావా.. ముంజలు బాగున్నాయా? అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించి, తాజా తాటి ముంజలను కోయించుకుని అక్కడికక్కడే రుచి చూశారు.

‘నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయ్‌’

ఆ తాటి ముంజలను తింటున్నప్పుడు చంద్రబాబు ముఖంలో ఒక సీఎం స్థాయి గాంభీర్యం లేదు.. కేవలం ఒక సామాన్య పల్లెటూరి బిడ్డ సంతోషం మాత్రమే కనిపించింది. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన మురిసిపోయారు. నారావారిపల్లెలో గడిపిన తన బాల్యాన్ని, ఆ రోజుల్లో స్నేహితులతో కలిసి తాటి ముంజలు తిన్న క్షణాలను ఆయన భువనేశ్వరితో పంచుకున్నారు.

వీడియో చూడండి..

ముంజలు అమ్ముతున్న వ్యక్తితో కాసేపు ముచ్చటించి, వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం దంపతులు తన బండి వద్ద ఆగి ముంజలు తినడమే కాకుండా, తనతో మాట్లాడటంతో ఆ పేద వ్యాపారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అత్యంత బిజీగా ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సాధారణ ప్రజల్లో ఒకరిగా మారి రోడ్డు పక్కన ముంజలు తిన్న ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే.. సొంత ఊరి మట్టి వాసన, చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా ఒకటే అంటూ నెటిజన్లు ఈ అరుదైన దృశ్యాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us